
ఆంటోనీతో కేసీఆర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు శనివారం రక్షణ మంత్రి ఆంటోనీతో భేటీ అయ్యారు. విభజన నిర్ణయానంతరం సీమాంధ్రలో ఆందోళనలపై కాంగ్రెస్ అధిష్టానం వేసిన త్రిసభ్య కమిటీకి ఆంటోనీ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఆంటోనీతో ఏకాంతంగా చర్చలు జరిపారని సమాచారం. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వారం కిందట ఢిల్లీ వచ్చిన కేసీఆర్ రెండురోజుల కిందట ఎంపీ మందా జగన్నాథం నివాసంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తాజాగా ఆయన ఆంటోనీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విభజన నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ సహా ఇతర అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. హైదారాబాద్‌లో సీమాంధ్రులు రెచ్చగొడుతున్నారని, 7న వారు తలపెట్టిన సమైక్యాంధ్ర సభ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.