ఆ అధికారం రాష్ట్రాలకివ్వాలి..
భూ సేకరణ చట్టాల రూపకల్పనపై కేసీఆర్
హైదరాబాద్: భూ సేకరణ చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉండాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ‘‘కేంద్ర ప్రభుత్వ చట్టాల వల్ల కొన్నిసార్లు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అందుకే ఫెడరల్ వ్యవస్థలో ప్రతి రాష్ట్రానికి దాని అవసరాలు, డిమాండ్లకు అనుగుణంగా సొంత చట్టాలుండాలి. భూ సేకరణ అంశం కేంద్రం చేతుల్లో ఉండొద్దని భావిస్తున్నాం. కేంద్రం ఇదే రీతిలో అలోచిస్తుందని ఆశిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. సీఐఐ జాతీయ అధ్యక్షుడు సుమిత్ మజుందార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఐఐ డైరక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, నౌషాద్ ఫోర్బ్స్, ఉపాధ్యక్షురాలు శోభనా కామినేని, సీఐఐ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షురాలు వనితా దాట్ల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌పై పారిశ్రామికవేత్తలు ప్రశంసలు కురిపించారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలతో ఈ సందర్భంగా సీఎం ముఖాముఖి మాట్లాడారు. పలు అంశాలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని స్పష్టీకరించారు. ‘‘హైదరాబాద్ చుట్టూ 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి వుంది. కానీ ప్రణాళిక శాస్త్రీయంగా లేకపోవడంతో ఫిర్యాదులందుతున్నాయి. హెచ్‌ఎండీఏ ప్రక్షాళనలో భాగంగా ఉన్నతాధికారితో సహా పలువురు అధికారులను బదిలీ చేశాం. హెచ్‌ఎండీఏ జోనింగ్ ప్రక్రియను పునః పరిశీలిస్తున్నాం. ఏయే జోన్లు ఎక్కడ వుండాలనే అంశంతో పాటు పర్యాటకాభివృద్ధిపైనా కసరత్తు చేసే బాధ్యతను అంతర్జాతీయ సంస్థలకు అప్పగించాం. త్వరలో హెచ్‌ఎండీఏపై ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం’’ అని వెల్లడించారు. ఇటీవల జీహెచ్‌ఎంసీలో జరిగిన కార్మికుల సమ్మెను సీఎం ప్రస్తావించారు. ‘‘ఈ నేపథ్యంలో కార్మిక విధానాలు ఎలా ఉండాలనే అంశంపై మీ నుంచి సూచనలు కోరుతున్నాం. ప్రపంచంలో అమల్లో ఉన్న అత్యుత్తమ కార్మిక విధానాలపై సూచనలివ్వండి. ఒక పద్దతంటూ లేని యూనియన్లవాదం (ఎరాటిక్ యూనియనిజం) అక్కడక్కడా వుంది’’ అంటూ కోల్‌కతా పర్యటనలో తనకెదురైన అనుభవాన్ని సీఎం వివరించారు. ఇలాంటి యూనియనిజం వల్లే పశ్చిమ బెంగాల్ శిథిలమైందన్నారు.
డాలస్ తరహా ప్రణాళికలు
‘‘హైదరాబాద్‌లో రూ.21వేల కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించబోతున్నాం. రూ.4 వేల కోట్ల పనులకు సంబంధించి త్వరలో టెండర్లు పిలవబోతున్నాం. ఈ విషయమై డాలస్ (అమెరికా) తరహా ప్రణాళికను రూపొందించే బాధ్యతను కెనడాకు చెందిన లీ అసోసియేట్స్‌కు అప్పగించాం’’ అని కేసీఆర్ వెల్లడించారు. ‘పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు భూ బ్యాంకును సిద్ధం చేశాం. ఐటీ, ఉత్పత్తి రంగాలకు చెందిన పరిశ్రమలు సొంతంగా టౌన్‌షిప్‌లు నిర్మించాలని సూచిస్తున్నాం. గ్రీన్ ఫీల్డ్ కార్యకలాపాల్లో భాగంగా టౌన్‌షిప్‌లు, విల్లాలుండేలా క్రెడాయ్‌తో చర్చించాం. నూతన పట్టణాల నిర్మాణంపై త్వరలో ప్రభుత్వం ఓ విధానం ప్రకటిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
నేను కూడా రైతునే.. : ముఖ్యమంత్రి
రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద అనేక ప్రణాళికలున్నాయని సీఎం పేర్కొన్నారు. తాను ఒక రైతునేనని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో ఆయన అన్నారు. ‘‘విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో అనువైన పరిస్థితులున్నాయి. హైదరాబాద్ చుట్టూ హరిత జోన్, అన్యదేశ పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రీన్ హౌజ్ సాగును ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే మూడు నాలుగేళ్లలో తెలంగాణ వ్యావసాయక రాష్ట్రంగా వర్ధిల్లుతుందన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేలా మామిడి రైతులకు ప్రోత్సాహకాలిస్తున్నాం. 2019 నాటికి రాష్ట్రంలో 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా రూ.91 వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. విద్యుదుత్పత్తిలో స్వావలంబన సాధించాక వ్యవసాయ వ్యర్థాలతోనూ విద్యుదుత్పత్తి అంశాన్ని పరిశీలిస్తాం. ఈఆర్‌సీ నుంచి జెన్‌కో తీసుకున్న రుణం తీరాక ఐటీ తదితర రంగాలకు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే అంశంపై త్వరలో విధానాన్ని ప్రకటిస్తాం. చక్కెర పరిశ్రమను ఆదుకునే దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకుంటాం’’ అని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ప్రత్యేకతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ వివరించారు.