ముఖ్యమంత్రి పదవిపై క్లారిటీ!
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపొందితే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని తాను చేపట్టబోతున్నానని వస్తున్న ఊహాగానాలకు అరవింద్ కేజ్రీవాల్ తెరదించారు. పంజాబ్ సీఎం అభ్యర్థిగా తను బరిలోకి దిగడం లేదని ఆయన స్పష్టం చేశారు. 'నేను ఢిల్లీ సీఎంగానే కొనసాగుతాను. పంజాబ్ నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తాం' అని కేజ్రీవాల్ వెల్లడించారు. పటియాలలో బుధవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు.
కేజ్రీవాల్‌ను చూసి ఆప్‌కు ఓటు వేయాలని ఆ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంగళవారం ఓటర్లను అభ్యర్థించిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న రాష్ట్రం అయిన ఢిల్లీ పీఠాన్ని వదిలేసి.. పెద్ద రాష్ట్రమైన పంజాబ్‌ను పాలించేందుకు కేజ్రీవాల్ ఆసక్తి చూపుతున్నారని, పంజాబ్‌లో ఆప్ గెలిస్తే.. కేజ్రీవాల్ సీఎం అవుతారని ఊహాగానాలు వచ్చాయి. మరోవైపు కేజ్రీవాల్ ఢిల్లీ కేంద్రంగా పంజాబ్ రాజకీయాలను నడిపించాలని చూస్తున్నారని, ఆయన మాటలను నమ్మి మోసపోవద్దని ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, అధికార అకాలీ దళ్ ఓటర్లను కోరుతున్నాయి.