న్యూఢిల్లీ: నగరంలో ఈ-రిక్షాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆప్ నేతలు కేంద్ర మంత్రి నితిన్ రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఒకవేళ బీజేపీ ఇచ్చిన సమయానికి ఈ -రిక్షాలపై నిషేధం ఎత్తివేయకపోతే ఆందోళనకు దిగుతామని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం ఉదయం గడ్కరీతో సమావేశమైంది. ఈ-రిక్షాలు నడుపుకునేవారి ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉత్తమమైన విధివిధానాలను రూపొందించాలని వారు గడ్కరీని కోరారు.
ఈ-రిక్షాల విధివిధానాల రూపకల్పనకు సంబంధించి సూచనలు, సలహాలు పదిరోజుల్లోగా ఇవ్వాల్సిందిగా కోరుతూ రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తాము నిషేధాన్ని రద్దు చేయాలని కోరామని, రిక్షాలు నడుపుకునేవారికి ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించినట్లు చెప్పామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ తెలిపారు.