బ్యాంకు ముందు సీఎం ధర్నా: మోదీపై ముప్పేట దాడి
తిరువనంతపురం: పట్టణాలు, నగరాల్లోని అన్ని బ్యాంకుల ముందు విపరీతమైన రద్నద్దీ ఉన్నందున గ్రామీణులను అందుబాటులో ఉండే సహకార బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి అవకాశం కల్పించాలని డిమాండ్ వస్తోంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు నిరాకరిస్తోంది.. దీంతో కొత్త నోట్లు వచ్చి పది రోజులు గడుస్తున్నా ప్రజల నోటు కష్టాలు రెట్టింపవుతున్నాయే తప్ప తగ్గడంలేదు. ఇటు విపక్షాలూ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. నడుమ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా దక్షిణాది రాష్ట్రం కేరళ సీఎం పినరయి విజయ్ లు మోదీపై ముప్పేటదాడిని ముమ్మరం చేశారు.
గ్రామీణులకు అందుబాటులో ఉండే సహకార బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి కల్పించని కేంద్రం తీరును నిరసిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏకంగా ఆర్బీఐ ముందు ధర్నాకు దిగారు. తన మంత్రివర్గ సహచరులు, విపక్ష నేతలు వెంటరాగా శుక్రవారం తిరువనంతపురంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం వద్ద సీఎం విజయన్ బైఠాయించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ధర్నా కొనసాగనుంది.
వేలాదిగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం విజయన్ మాట్లాడుతూ.. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆకస్మికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆమేరకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవస్థీకృత సహకార బ్యాంకుల ద్వారా నగదు మార్పిడికి అవకాశం కల్పిస్తే గ్రామీణులకు మేలుచేసినట్లవుతుందని అన్నారు. కేరళ రాష్ట్ర సహకార బ్యాంకుల వ్యవస్థలో అక్రమాలు జరిగాయన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను సీఎం ఖండించారు. సీఎం పిలపునకు స్పందించి విపక్షాలు కూడా అధికారపార్టీతో కలిసి నడవటం గమనార్హం. మరోవైపు ఎరువులు, విత్తనాల కొనుగోళ్లకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. రైతుల నుంచి పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవద్దని ఎరువులు శాఖకు సూచించింది. దీంతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.