
'సలాం కొట్టని ఐపీఎస్ కు నోటీసులు..'
ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తీరు కేరళ హోంమంత్రికి కోపాన్ని తెప్పించిన ఘటన విషయంలో రాషట్రప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగింది. ఆ ఐపీఎస్ కు నోటీసులు జారీ చేసింది.
తిరువనంతపురం: ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తీరు కేరళ హోంమంత్రికి కోపాన్ని తెప్పించిన ఘటన విషయంలో రాషట్రప్రభుత్వం ఉపశమన చర్యలకు దిగింది. ఆ ఐపీఎస్ కు నోటీసులు జారీ చేసింది. ఓ కార్యక్రమానికి వెళ్లిన తనకు ఎందుకు సరైన గౌరవం ఇవ్వలేదని, వందనం చేయలేదని ఆగ్రహంతో హోంమంత్రి రమేశ్ చెన్నితాలా ఆగ్రహంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనపట్ల ఆయన చిన్నబుచ్చుకుని ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు హోంశాఖ ఆ ఐపీఎస్ కు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 11న త్రిశూర్లో మహిళా పోలీసుల పరేడ్ కార్యక్రమానికి హోంమంత్రి రమేశ్ చెన్నితాలా హాజరయ్యారు. అదే కార్యక్రమంలో 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రిశిరాజ్ సింగ్ కూడా ఉన్నారు. అయితే, హోంమంత్రికి అక్కడే ఉన్న ఇతర పోలీసు అధికారులంతా గౌరవ వందనం చేయగా రిశిరాజ్ మాత్రం సెల్యూట్ చేయకుండా, ఆయన వచ్చినా ఏమీ పట్టనట్లు కూర్చుండిపోయారు. దీంతో ఆ ఐపీఎస్ అధికారికి నోటీసులు జారీ చేశారు.