ప్రముఖ హీరో అరెస్టు!
కొచ్చి: ప్రముఖ మలయాళ హీరో దిలీప్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసులో దిలీప్ నిందితుడిగా ఉన్నారు. ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
త్రిశూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్ ముగించుకొని నటి సాయంత్రం ఏడు గంటలకు ఎస్‌యూవీలో బయలుదేరింది. ఈ ఎస్‌యూవీని ఆమె నటిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థ లాల్ క్రియేషన్స్ సమకూర్చింది. కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమె బయలుదేరింది. ఆమె ప్రయాణిస్తున్న సమయంలోనే కారు డ్రైవర్ మార్టిన్ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్ ఇచ్చిన సమాచారంతో పల్సర్ సుని గ్యాంగ్ క్యాటరింగ్ వ్యాన్‌లో ఆమెను వెంటాడింది.
ఉద్దేశపూర్వకంగా రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌పోర్ట్ జంక్షన్‌లో ఆమె వావానాన్ని ఆ కిరాయిమూక తమ వ్యాన్‌తో ఢీకొట్టింది. నటి కారు ఆగగానే.. ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి.. తమ చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏ-3 నిందితుడు (అతని పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు) కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు. నల్ల టీషర్ట్ ధరించిన నాలుగో నిందితుడు కారులోకి ఎక్కాడు. నటిని బలవంతంగా నోరు మూసి వారు ముందుకు కదిలారు. అనంతరం మరో ఇద్దరు నిందితులు వాహనంలోకి వచ్చారు. వారు రూట్ మార్చి.. వాహనాన్ని ఓ ఇంటి ముందు ఆపారు.
అక్కడి నుంచి ప్రధాన నిందితుడు పల్సర్ సుని అలియాస్ సునిల్ కుమార్ రంగంలోకి వచ్చాడు. ముఖానికి టవల్ కట్టుకొని వచ్చిన అతను డ్రైవర్ సీటులోకి మారాడు. అప్పటివరకు వాహనాన్ని నడిపిన మార్టిన్ గ్యాంగ్‌లోని మిగతా సభ్యులతో కలిసి క్యాటరింగ్ వ్యాన్‌లోకి ఎక్కాడు. పల్సర్ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీసేందుకు థర్డ్‌పార్టీ తరఫున తాను వచ్చానని, తనకు సహకరించాలని నటితో అతను చెప్పాడు. కాసేపు నటిని అసభ్యంగా చిత్రీకరించిన అనంతరం ఆమెను కక్కనాడ్ సమీపంలోని పాదముద్గల్ వద్ద కారులోంచి బయటకు గెంటేశాడు. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది.
చదవండి: సంబంధిత కథనాలు
లైంగిక వేధింపులు: తొలిసారి పెదవివిప్పిన నటి!
హీరోయిన్ వేధింపుల కేసులో కీలక సాక్ష్యం
హీరోయిన్‌ను కారులో బందీగా చేసి..