రెండు రోజుల పోలీసుల కస్టడీకి నటుడు దిలీప్
- ఈ కేసు వెనుక కుట్ర కోణం ఏమిటి?
- దిలీప్‌ను ప్రశ్నించనున్న పోలీసులు
నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ అంగమలి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఆదేశాలు ఇచ్చింది. నటుడు దిలీప్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా, ఈ కేసులో దిలీప్‌ను కావాలని ఇరికించారని, అతను అమాయకుడినని ఆయన తరఫు నాయవ్యాది కోర్టుకు విన్నవించారు.
మరోవైపు ఈ కేసులో దిలీప్ కీలక నిందితుడని, అతన్ని విచారించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు మూడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించాలని పోలీసుల తరఫు న్యాయవాది కోరారు. కోర్టు మాత్రం రెండురోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. వ్యక్తిగత కక్షతోనే నటిపై ఇంతటి అఘాయిత్యాన్ని దిలీప్ చేయించాడని భావిస్తున్న నేపథ్యంలో దిలీప్‌ను మరింతగా లోతుగా ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కుట్రలో ఇంకెవరి ప్రమేయమైనా ఉందే అనే కోణంలో పోలీసుల ఇంటరాగేషన్ సాగనుంది. ముఖ్యంగా కొచ్చి, త్రిశూర్‌లోని పలు చోట్ల దిలీప్ నటిపై అఘాయిత్యానికి పథక రచన చేశాడని, కాబట్టి ఆయా ప్రాంతాలకు ఆయనను తీసుకెళ్లి విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. ఎందుకు నటిపై దిలీప్ పగ పెంచుకున్నాడు? అనే కోణంలోనూ విచారణ సాగనుంది.
తెలుగుతోపాటు పలు దక్షిణాది సినిమాల్లో నటించిన ప్రముఖ కథానాయికను కారులో లైంగిక వేధించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. అశ్లీల ఫొటోలు తీశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.