
‘ఖైరతాబాద్’ లడ్డూ తయారీ ప్రారంభం
తాపేశ్వరం (మండపేట) : ఖైరతాబాద్ గణనాథునికి తాపేశ్వరం సురుచి ఫుడ్స్ సంస్థ సమర్పించనున్న మహాలడ్డూ తయారీ ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. గణనాథుడి కోసం సురుచి సంస్థ 5,600 కిలోల లడ్డూ తయారు చేయనున్న విషయం విదితమే. ఇందుకోసం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబుతో పాటు 15 మంది కార్మికులు గణపతి మాలలు ధరించారు.
శనివారం లడ్డూ కోసం బూందీ తీయడం ప్రారంభించారు. ఇందుకోసం పొయ్యి లేని అత్యాధునిక వంటశాలను ప్రారంభించారు. థర్మల్ హీటింగ్ విధానంలోనిఈ వంటశాలలో కళాయిలు మాత్రమే ఉంటాయి. వంట చెరకు ఆధారిత ద్రవరూప గ్యాస్ ఇంధనంగా ఒకే వేడితో ఈ కళాయిల్లో నెయ్యి వేసి లడ్డూలు తీయడం ప్రారంభించారు.
ఈ రకమైన వంటశాల రాష్ట్రంలో ఇదే మొదటిదని మల్లిబాబు తెలిపారు. మహాలడ్డూ తయారీకి మరికొన్ని కొత్త యంత్రాలను కూడా వినియోగిస్తున్నట్టు తెలిపారు.