మంత్రులనూ బహిష్కరించండి : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న ఎంపీలతోపాటు మంత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్ చేసింది. సీమాంధ్రకు న్యాయం చేస్తూ తెలంగాణ బిల్లు తెస్తే మద్దతు తెలుపుతామని పునరుద్ఘాటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ బుధవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్ తెలంగాణ బిల్లును తీసుకురాదు. సీమాంధ్రకు న్యాయం చేయదు. వారి మంత్రులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు.
రెండు సభల్లోనూ ఇలానే ఉంది. మంత్రులు సభలో ఆందోళన చేయడం ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా చూశారా? ఇలాగైతే తెలంగాణ ఎలా వస్తుంది’ అని ప్రశ్నించారు. లోక్‌సభను అడ్డుకుంటున్న మంత్రులు, రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వారి విషయంలో మౌనం వీడి పార్టీ నుంచి తక్షణమే తప్పించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నామన్నారు. సభలకు తక్కువ సమయముందని, బిల్లు ఎప్పుడు ప్రవేశపెడతారని ప్రశ్నించారు. ‘‘అది ఆర్థిక బిల్లా, కాదా అనేది కాంగ్రెస్‌కు తెలియదు. రాజ్యాంగ సవరణ అవసరమా? లేదా అనేది కూడా తెలియదు. హోంవర్క్ చేయలేదు. మేనేజ్‌మెంట్‌లో విఫలమైంది. రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ పనిచేస్తుంది’’ అని ధ్వజమెత్తారు. తాము తెలంగాణ తెస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్పారు. కాగా, తెలంగాణ బిల్లు చారిత్రకం, అజరామరం అంటూనే కాంగ్రెస్ ఎప్పటికప్పుడు సరికొత్త నాటకాలు ఆడుతోందని బీజేపీ నేతలు ఎన్.రామచంద్రరావు, ఎస్.ప్రకాశ్‌రెడ్డి, ఎస్.కుమార్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి హైదరాబాద్‌లో విమర్శించారు.
సద్దుమణిగిన యెన్నం వివాదం
బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడుపై వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి వివాదం సద్దుమణిగింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు యెన్నం శ్రీనివాసరెడ్డి బుధవారం మీడియాకు చెప్పారు. తప్పు తెలుసుకున్న యెన్నంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వెంకయ్య సూచించడంతో వివాదానికి తెరపడింది.