విభజన కిరణం! | Kiran Kumar Reddy facilitating the process of State bifurcation | Sakshi
Sakshi News home page

విభజన కిరణం!

Published Sat, Nov 2 2013 1:15 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

Kiran Kumar Reddy facilitating the process of State bifurcation

*  సీఎం డెరైక్షన్‌లోనే చురుగ్గా విభజన ఏర్పాట్లు
కిరణ్ సూచనలతో ఢిల్లీకి సీఎస్.. అక్కడ పలువురు కేంద్ర అధికారులతో భేటీ
సీఎస్ తిరిగొచ్చాక రాష్ట్రానికి కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందం రాక
కావాల్సిన సమాచారం అందిస్తూ పూర్తిగా సహకరిస్తున్న రాష్ట్ర సర్కారు
విభజన భేటీలకు రాష్ట్ర అధికారులు హాజరయ్యేలా ఆదేశాలు
ఇప్పటికే అఖిల భారత సర్వీసు, ఉద్యోగుల వివరాలు ఢిల్లీకి అందజేసిన సీఎస్
* విద్యుత్, విద్య, వైద్యం, ఆరోగ్య శాఖల సమాచారం.. ఆస్తులు, అప్పులు, ఆదాయ వివరాలు కూడా..
విభజన వేగంగా చేయడానికి కేంద్రం హడావుడి
ఓ వైపు ఈ ఏర్పాట్లన్నీ చకచకా చేయిస్తూ..  మరో వైపు సమైక్యవాదినంటూ సీఎం డాంబికాలు
పైగా వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ దిన వేడుకలు జరుపుకొంటామో లేదోనంటూ నిట్టూర్పు
 
సాక్షి, హైదరాబాద్: అంతా అనుకుంటున్నట్లే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డెరైక్షన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన ప్లాన్ చకచకా అమలవుతోంది. సీఎం కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఒకపక్క సమైక్య వాదం వినిపిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మరో పక్క మాత్రం.. విభజనకు కావాల్సిన ఏర్పాట్లను చక్కబెట్టడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ప్రకటనలు చేస్తున్న ఆయన నేతృత్వంలోని ప్రభుత్వమే.. ఇటు రాష్ట్ర విభజనకు అవసరమైన సకల సమాచారాన్ని కేంద్రానికి చేరవేస్తుండడం గమనార్హం.

అయితే ముఖ్యమంత్రి ఇప్పటికీ సమైక్య ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం చూసి.. విభజన ఏర్పాట్లు చూస్తున్న అధికారులు సైతం విస్తుపోతున్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో సైతం తాను గట్టి సమైక్యవాదినంటూ కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసి వారు కంగుతిన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకొంటామో లేదోనంటూ ఆయన నిట్టూర్చడం చూసి ఆశ్చర్యపోయారు.
 
రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే విభజన నోట్..
వాస్తవానికి విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడానికి ముందే రాష్ట్రానికి సంబంధించిన సమాచారమంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి చేరింది. కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్యవాదినంటూ ప్రకటనలు చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి కార్యాలయమైన ‘సీ బ్లాక్’ సాధారణ పరిపాలన శాఖలో నోడల్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అంతకు ముందు ప్రణాళిక శాఖ నుంచి పూర్తి స్థాయిలో నివేదికలు కేంద్ర హోంశాఖకు చేరాయి. సీడబ్ల్యూసీ తీర్మానం రోజున ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌కు అవసరమైన సమాచారాన్ని మెయిల్ చేశారు.

ఈ అధికారులు తరచూ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతూనే దిగ్విజయ్ కార్యాలయం అడిగిన ప్రతి సమాచారాన్ని అందచేశారు. అదే విషయాన్ని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వివరించారు. సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందే అప్పటి డీజీపీ దినేష్‌రెడ్డిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పిలిచి రాష్ట్ర విభజనపై చర్చలు జరిపింది. సీఎస్ సహా పలువురు సీనియర్ అధికారులు అప్పటికే ఢిల్లీ వెళ్లి వారికి అవసరమైన సమాచారాన్ని అందజేశారు. తెలంగాణ విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడానికి రూపొందించిన నోట్ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే తయారైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సమాచారంతో పాటు ఆ నోట్‌లో ఏయే అంశాలు ఉన్నాయన్నది సీఎంకు ముందే చేరవేశామని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
 
సీఎం ఓకే.. విభజన సమావేశాలకు అధికారుల హాజరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునకు సంబంధించి కేంద్ర హోం శాఖతో పాటు వివిధ శాఖలు అడుగుతున్న సమాచారాన్ని ఆగమేఘాల మీద ఢిల్లీకి పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సీఎస్ సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఢిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందంలో ఎవరెవరు ఉండాలి? రాష్ట్రంలో ఎవరి నుంచి సలహాలు స్వీకరించాలి? వంటి అంశాలను చర్చించేందుకు ప్రధాన కార్యదర్శి మహంతిని గత వారం ఢిల్లీ పిలిపించారు.

ఆ వెంటనే సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల అంశాలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహపత్రం రూపొందించడానికి రాష్ట్రానికి వచ్చి మూడు రోజుల పాటు ఉన్న కేంద్ర టాస్క్‌ఫోర్స్ బృందానికి సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు అన్ని విధాలుగా సహకరించారు. ఈ బృందం సమావేశాలకు హాజరు కావాల్సిందిగా ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ బృందానికి నాయకత్వం వహిస్తున్న విజయ్‌కుమార్ కూడా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమై చర్చించారు.
 
ఉద్యోగులు, విద్యుత్ పంపిణీ వివరాలు ఇప్పటికే ఢిల్లీకి..
రాష్ట్రంలో అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గత నెల 30నే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి అందజేశారు. అధికారులు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించి అవలంబించాల్సిన విధానం గురించి కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ అధికారులు సీఎస్‌కు వివరించడంతో పాటు అధికారుల వివరాలు పంపించడానికి ప్రత్యేకంగా నమూనా పత్రాన్ని అందజేశారు. ఆ పత్రం మేరకు వివరాలను త్వరగా పంపించాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ రంగం విభజనకు సంబంధించి ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా అంశాల విభజనపై కేంద్ర ఇంధన శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఢిల్లీలో రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.సాహు సమావేశమై చర్చించారు. జిల్లాల వారీగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, సరఫరా అంశాలతో పాటు బొగ్గు, గ్యాస్ వివరాలను కేంద్ర ఇంధన శాఖకు అందజేశారు.
 
విద్యపై కేంద్రం భేటీకి రాష్ట్ర అధికారుల హాజరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఉన్నత విద్య, సెకండరీ విద్య అంశాల పంపిణీకి సంబంధించి కూడా శుక్రవారం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, సెకండరీ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ హాజరయ్యారు. జిల్లాల వారీగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు, విద్యార్థులు, అధ్యాపకుల సంఖ్యలను ఈ సందర్భంగా కేంద్రానికి అందజేశారు. కేంద్ర ప్రాయోజిత విద్యా సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో లేవనే వివరాలను కూడా అందజేశారు. అలాగే ఇప్పటికే రాష్ట్ర అప్పులు, ఆస్తులు, ఆదాయ వివరాలను కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కేంద్రానికి పంపించారు.
 
ఈ-మెయిల్‌లో సమాచారం కోరుతున్న జలసంఘం
జలవనరులు, సాగునీటి ప్రాజెక్టుల వివరాలను, నీటి కేటాయింపుల వివరాలను కూడా రాష్ట్ర అధికారులు కేంద్రానికి పంపించారు. జలవనరుల పంపిణీకి సబంధించిన విషయంలో కేంద్ర జల సంఘం కీలక పాత్ర వహిస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు ఏదైనా అంశంపై సమాచారం కావాలంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్, ఈ-మెయిల్ ద్వారా ఆ సమాచారాన్ని పంపించాలని కోరుతున్నారు. కేంద్రం కోరిన సమాచారాన్ని సంబంధిత ఉన్నతాధికారులు ఈ-మెయిల్ ద్వారా పంపిస్తున్నారు. అలాగే జిల్లాల వారీగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, సీట్ల వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.

ప్రభుత్వానికి చెందిన ప్రధాన ఆసుపత్రులు ఏ ప్రాంతంలో ఏమేమి ఉన్నాయనే వివరాలను కూడా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారుల తీరు చూస్తుంటే రాష్ట్ర విభజనను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సమాచారం కోసం ఫోన్లు చేస్తూ ఐదు నిమిషాల్లో ఈ-మెయిల్స్ పంపాలని కేంద్ర అధికారులు కోరుతున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం హడావుడి చూస్తుంటే ఈ నెలలోనే రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చేలాగ ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నవంబర్ చివరి వారంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అసెంబ్లీ అభిప్రాయానికి పంపించాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.
 
సమైక్య ముసుగులో రాజకీయాలు
భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని పరామర్శించడానికి వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను అడ్డుకొని అదుపులోకి తీసుకోవడంతోనే కిరణ్‌కుమార్ రెడ్డి సమైక్య రాజకీయం బయటపడింది. సమైక్యవాదినని ప్రచారం చేసుకోవడమే తప్ప ఆచరణలో ఆయన దానిని అమలు చేయడం లేదని స్పష్టమైందని పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు.

‘ముఖ్యమంత్రి నిజంగా సమైక్యవాది అయితే నల్లగొండలో విజయమ్మ పర్యటనకు అవకాశం కల్పించేవారు. కానీ, ఆయనకు ఇష్టం లేకపోవడం వల్లే పోలీసులు ఆమెను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు’ అని రాయలసీమకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు మండిపడ్డారు. సచివాలయం సీ బ్లాక్ వద్ద విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. విజయమ్మను అడ్డుకోవడంతోనే కిరణ్ సమైక్య ముసుగు తొలగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement