అధిష్టానం పిలుపుతో హస్తినకు కిరణ్
హైదరాబాద్ : అధిష్టానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవార ఉదయం ఢిల్లీ బయల్దేరారు. కాగా రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీలో దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్‌నేతలు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్మారక చిహ్నమైన శక్తిస్థల్ వద్ద నిరసన దీక్షను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో తాము చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి గత రెండురోజులుగా కొందరు మంత్రులు, ఇతర నేతలతో సమావేశమై చర్చించారు. బిల్లుకు మద్దతు పలకరాదని కోరేందుకు ఇతర పార్టీల నేతలను కలవాలా? లేదా? అన్న అంశంపై తర్జనభర్జనలు సాగించారు. కాగా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఐదో తేదీకి ఖరారైన నేపథ్యంలో రేపు ఢిల్లీ వెళ్లాలని సీఎం భావించారు. అయితే అధిష్టానం పిలుపుతో ఒకరోజు ముందే బయల్దేరారు.