పబ్లిగ్గా అమ్మాయికి ముద్దు.. భారీగా ఆదాయం!
న్యూఢిల్లీ: వివాదాస్పద ‘ది క్రేజీ సుమిత్ ప్రాంక్’ యూట్యూబ్ వీడియోపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 1న పోస్ట్ అయిన ఈ వీడియోలో.. యువతులను బహిరంగంగా ముద్దుపెట్టుకెట్టుకున్న యువకుడిని, అతనికి సహకరించిన కెమెరామెన్‌ను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. కేవలం సెన్సేషన్ కోసం రూపొందించిన వీడియో ద్వారా నిందితులు భారీగా డబ్బు సంపాదించారని ఢిల్లీ జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ తెలిపారు. సదరు వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
(కీచక వినోదం: ప్రాంక్ పేరిట పబ్లిగ్గా ముద్దు..)
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే యువతులకు ముద్దులు పెడుతూ.. సుమిత్ కుమార్ సింగ్, అతని అనుచరుడు సత్యజిత్ కద్యాన్‌లు రూపొందించిన వీడియోను యూట్యూబ్‌లో లక్షమందికిపైగా వీక్షించారని, కేవలం సెన్సేషన్ కోసం రూపొందించిన ఈ వీడియో ద్వారా వారు సుమారు రూ.70వేల ఆదాయాన్ని ఆర్జించారని పోలీసులు చెప్పారు. అంతేకాదు, తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ సాధించినందుకుగానూ యూట్యూబ్ సంస్థ సుమిత్ గ్యాంగ్‌కు అప్రైజల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని తెలిపారు.
అయితే సదరు వీడియోలోని అమ్మాయిలంతా తమవాళ్లేనని, ముద్దు పెట్టుకోగానే షాక్‌కు గురైనట్లు నటించేలా ముందే ఒప్పందాలు కుదిరాయని ప్రధాన నిందితుడు సుమిత్ చెప్పనట్లు పోలీసులు పేర్కొన్నారు. నిదితులు చెప్పిన వివరాల ఆధారంగా వీడియోలోని అమ్మాయిలను కూడా ప్రశ్నిస్తామని, ఒకవేళ ఆ అమ్మాయిలు నిందితులకు తెలిసినవారే అయినా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం నేరం కాబట్టి ఆమేరకు కేసు నమోదుచేస్తామని జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ వివరించారు.
ఇలాంటి అసభ్యకర వీడియోలను పబ్లిష్ చేయడమేకాక, హిట్స్ వచ్చినందుకు సర్జిఫికేట్ ఇవ్వడంపై యూట్యూబ్ యాజమాన్యమైన గూగుల్ సంస్థకు కూడా నోటీసులు ఇస్తామని పోలీసులు చెప్పారు. దీనిపై గూగుల్ సంస్థ కూడా స్పందించింది. ‘వేధింపులు, హింసను ప్రేరేపించే వీడియోలు, విద్వేష వ్యాఖ్యలు, షాకింగ్ సంఘటనలు, అభ్యంతరకర సందేశాలు.. వాటికి సంబంధించిన వీడియోలను నిషేధించేలా మా సంస్థకు నిర్దిష్ట ప్రమాణాలున్నాయి. సుమిత్ ప్రాంక్ వీడియో కేసులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాం’అని యూట్యూబ్ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.
వాళ్లు ఆపితేనే ఆగుతా: నిందితుడు సుమిత్
కాగా, దర్యాప్తు సందర్భంగా నిందితుడు సుమిత్ కుమార్ సింగ్ తానేతప్పూ చేయలేదని వాదించుకోవడం గమనార్హం. సుమిత్.. ఏడాదికాలంగా యూట్యూబ్‌లో చానెల్ నడుపుతున్నానని, ఇప్పటివరకు 35కుపైగా వీడియోలను పోస్ట్‌చేశాడని, వాటికి వచ్చే హిట్స్‌ను బట్టి, యూట్యూబ్ అకౌంట్ ద్వారానే డబ్బులు పోగేశాడని పోలీసులు తెలిపారు. ‘నేను చేసింది తప్పని సెన్సార్ బోర్డు నిర్ధారించాలి. వాళ్లు చెబితే తప్ప ఇలాంటి వీడియోలు తీయడం ఆపను’అని సుమిత్ మీడియాతో అన్నాడు.