జయలలిత వీలునామా కోసమే హత్యలు? | Kodanad estate murders aimed at will of Jayalalithaa, say police | Sakshi
Sakshi News home page

జయలలిత వీలునామా కోసమే హత్యలు?

Published Tue, May 2 2017 12:42 PM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

జయలలిత వీలునామా కోసమే హత్యలు?

జయలలిత వీలునామా కోసమే హత్యలు?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత.. వరుసపెట్టి గృహదహనాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా కొడనాడులోని ఆమె ఎస్టేట్‌లో ఓం బహదూర్ అనే వాచ్‌మన్‌ను చంపి, అక్కడ కీలకమైన కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు ఒకేసమయంలో ఒకరు తమిళనాడులోని సేలంలోను, మరొకరు కేరళలోను ప్రమాదాలకు గురయ్యారు. సేలంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, కేరళలో వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకొన్నాడు గానీ, అతడి భార్య, కూతురు చనిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని పోలీసులు ఆరా తీస్తే.. జయలలిత రాసిన వీలునామా కోసమేనని తేలింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారీగా ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. అయితే అవి ఎవరికి చెందుతాయనే విషయం ఆమె జీవించి ఉన్నంత కాలం ఎవరికీ తెలియలేదు. బహుశా ఆమె వీలునామా రాసి ఉంటారని, అది కొడనాడు ఎస్టేట్‌లోనే ఉండొచ్చన్న అనుమానంతోనే దానిమీద దాడిచేసి వాచ్‌మన్‌ను హతమార్చారని అనుకుంటున్నారు.

గత నెల 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొడనాడు ఎస్టేట్ వద్దకు మూడు వాహనాల్లో 11 మంది దుండగులు వచ్చారు. అక్కడున్న ఇద్దరు వాచ్‌మన్‌ల మీద దాడి చేశారు. వారిలో ఓం బహదూర్ థాపా అక్కడికక్కడే మరణించగా కృష్ణ బహదూర్ థాపా మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జయలలిత, శశికళ ఉపయోగిస్తారని భావించిన మూడు గదుల్లో కిటికీ అద్దాలు పగలగొట్టి, లోపలకు వెళ్లి అక్కడున్న 'విలువైన' వస్తువులను తీసుకెళ్లారు. పోలీసుల లెక్కల ప్రకారం కేవలం ఐదు వాచీలు, ఒక క్రిస్టల్ షోపీస్ మాత్రమే పోయాయని అంటున్నారు. కానీ వాస్తవానికి అంతకంటే ఎన్నో రెట్ల విలువైన వీలునామా, ఇతర పత్రాలు పోయాయాని భావిస్తున్నారు.

ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడైన సాయన్.. కేరళలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి భార్య, కుమార్తె మరణించారు. దాంతో ఇప్పుడు అతడిని ప్రశ్నించే పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. జయలలిత గదిలో ఉన్న ఒక సూట్‌కేసులోనే వీలునామా ఉండొచ్చని ఆమె వద్ద చాలాకాలంగా పనిచేసిన వాళ్లు చెబుతున్నారు. అయితే ఆ సూట్ కేసు విషయం కేవలం జయలలిత, శశికళ, మరికొందరికి మాత్రమే తెలుసని.. అలాంటప్పుడు ఈ దాడులు ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పలువురు పెద్దమనుషుల పేర్లు కూడా వినిపిస్తుండటం, వేరే రాష్ట్రాలకు కూడా సంబంధం ఉండటంతో ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement