సాక్షి, హైదరాబాద్ : పనేమీ చేయకుండానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకుంటున్న జీతం ఆయన ఒంటికి ఎలా పడుతున్నదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రశ్నించారు. అసలేమీ పనిచేయని ప్రభుత్వానికి అధినేతగా ఉన్న కిరణ్ హోదా, కిరీటం, అధికారదర్పంతో పాటు జీతం కూడా తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ విలీన దినం సందర్భంగా మంగళవారం టీజేఏసీ కార్యాలయంలో, ఏవీ కాలేజీలో జరిగిన కార్యక్రమాల్లో కోదండరాం మాట్లాడారు.
తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు అభివృద్ధిని ఆపుతామా? అంటూ మాట్లాడిన కిరణ్... సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం జరిపించడం తప్ప రచ్చబండ ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. పనులేమీ చేయకుండా జీతం తీసుకుంటున్నందుకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటే కిరణ్‌ను శూరుడని, వీరుడని అనొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. సమ్మె చేయాలనే కోరిక ఏపీఎన్‌జీవోలకన్నా ప్రభుత్వానికే ఎక్కువగా ఉందని, కోర్టు కూడా ఆ అర్థమే వచ్చే విధంగా వ్యాఖ్యానించిందన్నారు.
టీ మంత్రుల చేతికానితనం వల్లే..
తెలంగాణ మంత్రులకు సోయితప్పి, వారి చేతకానితనంవల్లే.. హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు ప్రభుత్వ అనుమతి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రకటన అమలుచేయాలని ఒత్తిడి చేయలేని వారికి పదవులు ఎందుకు? కేవలం పైరవీలు చేసుకోవడానికేనా? అని కోదండరాం మండిపడ్డారు. 1948 సెప్టెంబర్ 17న బడా భూస్వాములు, జాగీర్దార్ల నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను.. 1956లో బలవంతంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని కోదండరాం చెప్పారు. తెలంగాణ విడిపోతే కరెంటు బిల్లులు పెరుగుతాయని, ఆర్టీసీ నడవదని చెబుతూ... జీతాలు, పించన్లు, రేషన్ కార్డులు కూడా ఇవ్వలేమంటున్న సీమాంధ్ర నేతలే ఇప్పటిదాకా జరిగిన దోపిడీకి నిదర్శనమని కోదండరాం చెప్పారు. హైదరాబాద్, నీళ్లు వంటి అంశాలు.. ఇరు ప్రాంతాలు ఘర్షణ పడేంత పెద్దవి కావన్నారు. దోపిడీ నుండి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నదని పేర్కొన్నారు.
ఆధిపత్యం కోసం సీమాంధ్ర ఉద్యమం..
ఆధిపత్యం కోసం సీమాంధ్ర ఉద్యమం జరుగుతున్నదని కోదండరాం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గందరగోళంలో పడటం సరికాదన్నారు. ఇంకా తెలంగాణ రాకుంటే యుద్ధమంటే ఏమిటో, తిరుగుబాటు పోరాటాలు ఎలా ఉంటాయో చూస్తారని హెచ్చరించారు. 29న హైదరాబాద్ నిజాం కళాశాలలో జరిగే ‘సకల జనభేరి సదస్సు’కు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. సదస్సు నిర్వహణ కోసం ఇప్పటికే పోలీసు కమిషనర్‌కు దరఖాస్తు చేశామని, గతంలోలా సాగదీయకుండా అనుమతివ్వాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారక రామారావు మాట్లాడుతూ.. కిరణ్, చంద్రబాబు, జగన్ వంటి సీమాంధ్ర నేతలు ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణకు వ్యతిరేకులేనన్నారు. దున్నపోతుకు సున్నం వేస్తే ఎద్దు కాదని, కిరణ్ ఎన్నిమాటలు చెప్పినా తెలంగాణపై ప్రేమ లేదని విమర్శించారు. 13 సీమాంధ్ర జిల్లాలే తెలుగు జిల్లాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి టాక్సా అధ్యక్షుడు వీ రాజమహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా టీఆర్‌ఎస్ నేతలు కే విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్ ప్రసంగించారు. కాగా.. తెలంగాణ విలీన దినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ సీనియర్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేశారు. జాప్యం చేయకుండా కేబినెట్‌లో తీర్మానం చేసి, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
జీతం ఒంటికి ఎలా పడుతోంది? : కోదండరాం
Published Wed, Sep 18 2013 2:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement