ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ‘అంగన్‌వాడీ కార్యకర్తలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని కోరితే 500 రూపాయలు మాత్రమే పెంచి బండచాకిరి చేయిస్తున్నారు. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్త వెనుక 1000 మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. వారిని నిర్లక్ష్యం చేస్తే చంద్రబాబునాయుడుకు పట్టిన గతే మీకూ పడుతుంది’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి హెచ్చరించారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ మంగళవారం నిర్వహించిన చలో కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కదంతొక్కారు. వారినుద్దేశించి జయలక్ష్మి మాట్లాడుతూ ఐసీడీఎస్ వ్యవస్థను ప్రారంభించి 37 సంవత్సరాలైనప్పటికీ అందులో పనిచేసే అంగన్‌వాడీల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. నిత్యావసరాల సరుకుల ధరలు నింగినంటుతున్నాయని, గ్యాస్, విద్యుత్, పెట్రోలు.. ఇలా అన్నిరకాల ధరలు పెరిగిపోతున్నాయని, కానీ, అంగన్‌వాడీల జీతాల్లో పెంపుదల లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోవడం లేదని విమర్శించారు. దశాబ్దాల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమను ఉద్యోగులుగా కూడా చూడకుండా కార్యకర్తలుగా చూస్తూ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఐసీడీఎస్‌కు తమ శక్తి మొత్తం ధారపోస్తే రిటైర్‌మెంట్ కూడా ఇవ్వకుండా రాజీనామాలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వర్తించాలని ఆదేశించడం ఏంటని ప్రశ్నించారు. అందుకనుగుణంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ఐసీడీఎస్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి తమకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఐటీసీ కంపెనీకి 34 అంగన్‌వాడీ కేంద్రాలను, ఐకేపీకి బాలబడులను అప్పగిస్తున్నారని తెలిపారు. పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ అంగన్‌వాడీ కేంద్రాలను పటిష్టం చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓట్ల కోసం, సీట్ల కోసం పథకం మీద పథకం ప్రవేశపెడుతున్నారే తప్ప అంగన్‌వాడీ కేంద్రాలకు సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన చేయడం లేదన్నారు. పైగా ఐసీడీఎస్ కోసం కేటాయించిన బడ్జెట్‌ను దారిమళ్లిస్తున్నారని మండిపడ్డారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్న భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి కేవలం ఇరవై పైసలు ఖర్చు చేస్తున్నారంటే ఐసీడీఎస్‌పై ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు సక్రమంగా నడవాలంటే కార్యకర్తలకు అదనపు పనులు అప్పగించరాదని డిమాండ్ చేశారు. కేవలం తనిఖీలు నిర్వహించడమే కాకుండా సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల భవనాలకు అద్దెలు పెంచినప్పటికీ ప్రభుత్వం నిధులు పెంచకుండా సవాలక్ష నిబంధనలు విధించడం వల్ల అంగన్‌వాడీల జీతంలో కొంతమొత్తాన్ని అద్దెకు కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఎలాంటి షరతులూ లేకుండా అద్దె చెల్లించడంతోపాటు అంగన్‌వాడీలకు కనీస వేతనంగా నెలకు 12,500 రూపాయలు చెల్లించాలని జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపూర్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గంటెనపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, యునెటైడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పీడీ కార్యాలయం ముట్టడి...
చలో కలెక్టరేట్ అనంతరం ప్రదర్శనగా వెళ్లి రాంనగర్‌లోని మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆందోళనకారుల వద్దకు వచ్చిన ప్రాజెక్టు డెరైక్టర్ విద్యావతి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అర్ధాకలితో అలమటిస్తున్నారు
Published Wed, Jan 8 2014 2:50 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement