మోదీకి నల్లరంగు పూస్తే.. 25 లక్షలు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖం మీద ఎవరైనా నల్లరంగు పూస్తే వారికి రూ. 25 లక్షలు ఇస్తానంటూ.. కోల్‌కతాలోని టిపు సుల్తాన్ మసీదు ఇమామ్ నూరుర్ రెహ్మాన్ బర్కతీ ఫత్వా జారీచేశారు.
పెద్దనోట్ల రద్దు వల్ల దేశంలో చాలామంది అష్టకష్టాల పాలవుతున్నారని, దీనంతటికీ కారణమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖం మీద ఎవరైనా నల్లరంగు పూస్తే వారికి రూ. 25 లక్షలు ఇస్తానంటూ.. కోల్‌కతాలోని టిపు సుల్తాన్ మసీదు ఇమామ్ నూరుర్ రెహ్మాన్ బర్కతీ ఓ ఫత్వా జారీచేశారు. తరచు ఇలాంటి వివాదాస్పదమైన ఫత్వాలు ఇస్తూ, పత్రికల హెడ్‌లైన్లలో నిలిచే బర్కతీ ఈసారి ఏకంగా ప్రధానమంత్రినే టార్గెట్ చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ బర్కతీ మాత్రం దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన మానాన తాను ఫత్వాలు ఇచ్చుకుంటూనే పోతున్నారు.
మోదీ మీద ఇచ్చిన ఫత్వాకు తాను కట్టుబడి ఉన్నానని.. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు మందు క్యూలలో నిలబడి ఇప్పటివరకు మరణించిన 127 మంది చావులకు కూడా ఆయనే కారణమని బర్కతీ అంటున్నారు. తాను ఈ ఫత్వా ఇచ్చినందుకు వేలాది మంది ఫోన్లు చేసి, మెసేజిలు పంపి అభినందిస్తున్నారని చెప్పారు. మోదీ కంటే ముందు ఆయన పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మీద కూడా ఓ ఫత్వా జారీచేశౄరు. మమతా బెనర్జీ మీద వ్యాఖ్యలు చేసినందుకు ఆ ఫత్వా ఇచ్చారు. ఘోష్‌ను గులకరాళ్లతో కొట్టి, బెంగాల్ నుంచి తరిమేయాలని అన్నారు. ఇంకా సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్, తారిక్ ఫతపే లాంటి రచయితల మీద కూడా ఇంతకుముందు బర్కతీ ఫత్వాలు ఇచ్చారు. భగవంతుడే తనను రక్షిస్తాడని ఆయన చెబుతున్నా.. కోల్‌కతా పోలీసులు 24 గంటలూ ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు.