ఆఖరు నిమిషంలో హడావుడి
నత్తనడక: బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం
విచారణ జాబితాలోకి పాత ఎస్‌ఎల్‌పీ..హుటాహుటిన కొత్త ఎస్‌ఎల్‌పీ దాఖలు
రెండూ కలిపి విచారించమని నివేదించనున్న రాష్ట్ర సర్కార్
నేడు ‘సుప్రీం’లో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం మరోసారి బహిర్గతమైంది. రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీసిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు విషయంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ)ను గురువారం వరకు దాఖలు చేయకుండా ఉదాసీనతను ఘనంగా చాటింది. కృష్ణా జలాల నీటి కేటాయింపులపై జస్టిస్ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర తీర్పుపై గతంలో పెండింగ్‌లో ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానున్న నేపథ్యంలో.. హడావుడిగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పుపై గురువారం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. రెండింటిని కలిపి విచారించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని శుక్రవారం అభ్యర్థించాలనుకుంటోంది.
పాత పిటిషన్ ఇదీ..
2010 డిసెంబర్ 30న వెలువరించిన ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పులో పలు అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆ తీర్పును వ్యతిరేకిస్తూ 2011 మార్చి 28న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అయితే..
- ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడ్డాక రావాలని సుప్రీంకోర్టు 2011 సెప్టెంబరు 16న తన మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా.. తాము తుది తీర్పు ఇచ్చేవరకు ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయరాదని కేంద్రాన్ని ఆదేశించింది. గత ఏడాది నవంబర్ 29నాటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పులో మనకు రావాల్సిన కృష్ణా మిగులు జలాల ను ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయడం, అలమట్టి డ్యామ్ ఎత్తు పెంపును సమ్మతించడం, నీటి లభ్యత అంచనా కోసం 65 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలు మనకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి.
- ఇదే సమయంలో తీవ్ర కరువు ప్రాంతాల్లో నీటిని అందించడానికి ఉద్దేశించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎమ్మార్పీ, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని కేటాయించలేదు. ఈ తుది తీర్పు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోనుంది.
- అయితే, ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ప్రకారమే ట్రిబ్యునల్ తీర్పు అమలవుతుంది. ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడిన నెలన్నర తరువాత శుక్రవారం ఈ కేసు విచారణకు రానుంది.
ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తుది తీర్పును సవరించాలని, అంతవరకు ప్రస్తుత స్టేను కొనసాగించాలని తాజా పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ‘సుప్రీం’ను కోరింది. ‘65 శాతం డిపెండబులిటీని పరిగణనలోకి తీసుకోవడం అన్యాయం. ఇది బచావత్ అవార్డును తిరగదోడడమే. ఈ అధికారం బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు లేదు. ఆల్మట్టి విషయంలో రాష్ట్రవాదనలను పట్టించుకోలేదు. మిగులు జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారు’ అని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. అలాగే, ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పుపై పాత పిటిషన్‌ను, తుది తీర్పుపై వేసిన తాజా పిటిషన్‌ను కలిపి విచారించాలని ‘సుప్రీం’ను సర్కార్ కోరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.