కుకుంబర్‌ను కుకర్‌బాంబ్ అన్నందుకు..
లండన్: బ్రిటన్‌లో నాలుగేళ్ల చిన్నారి ‘కుకుంబర్ (దోసకాయ)’ స్పెల్లింగ్‌ను ‘కుకర్ బాంబ్’ అని పొరపాటుగా పలకడం నేరమైంది. స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారిని తీవ్రవాద వ్యతిరేక చర్యలకు సిఫార్సు చేసింది. లూటన్‌లోని నర్సరీ పాఠశాలలో చదువుతున్న చిన్నారి.. ఒక మనిషి పెద్ద కత్తితో కూరగాయలను కోస్తున్న చిత్రాన్ని వేశాడు.
అప్పుడు కుకుంబర్ అని చెప్పడానికి బదులు ‘కుకర్ బాంబ్’ అని పలికాడు. దీంతో పాఠశాల తమ బాబుకు శిక్ష విధించిందంటూ అతడి తల్లి వాపోయింది. కుకర్ బాంబ్ అని పలికినందుకు ఆ బాబును హోం శాఖ నిర్వహించే ఉగ్రవాద నిరోధక కార్యక్రమానికి పంపాలని ప్రతిపాదించామని పాఠశాల సిబ్బంది చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.