
నా హ్యాట్రిక్ క్రెడిట్ ఆ ఇద్దరిదే: కుల్దీప్ యాదవ్
కోల్‌కతా: కుల్దీప్ యాదవ్ 'హ్యాట్రిక్' జోరుతో టీమిండియా రెండోవన్డేలో ఆస్ట్రేలియాపై అలవోకగా విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో గెలిచి ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.
భారత్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో బౌలర్ కుల్దీప్ యాదవ్. గతంలో చేతన్ శర్మ (న్యూజిలాండ్‌పై), కపిల్‌దేవ్ (శ్రీలంకపై) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్‌కిది రెండో హ్యాట్రిక్. 2014లో జరిగిన అండర్–19 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కుల్దీప్ ‘హ్యాట్రిక్’ సాధించాడు.
253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు 33 ఓవర్‌లో స్పిన్నర్ కుల్దీప్ తన మణికట్టు మాయాజాలంతో చుక్కలుచూపించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ మథ్యూ వేడ్, ఆష్టన్ అగర్, పాట్ కమిన్స్‌లను వరుసగా పెవిలియన్ చేర్చి.. కోలుకోలేని దెబ్బతీశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కుల్దీప్ తన హ్యాట్రిక్ క్రెడిట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, సీనియర్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనీదేనని చెప్పాడు.
'ఎలా బౌలింగ్ చేయాలని నేను మహి భాయ్ (ధోనీ)ని అడిగాను. నీకు నచ్చినట్టు బౌలింగ్ చేయమని మహి సూచించాడు. హ్యాట్రిక్ బాల్ మహి చెప్పినట్టే వేశాను. ఇది గేమ్‌ను మార్చేసింది. ఎంతో గర్వంగా ఉంది. నాకు అండగా నిలిచినందుకు కోహ్లికి, ధోనీకి కృతజ్ఞతలు' అని కుల్దీప్ చెప్పాడు. మొదటి ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొన్నానని, అయినా క్రికెట్‌లో ఏదైనా జరుగుతుందని తెలిపాడు. గత వన్డేలో తన ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదారని, ఆ అనుభవం నుంచి తాను నేర్చుకున్నానని చెప్పాడు.