లీజులు, అద్దెలపై జీఎస్టీ! | Land leasing, renting to attract GST from 1st July | Sakshi
Sakshi News home page

లీజులు, అద్దెలపై జీఎస్టీ!

Published Wed, Mar 29 2017 2:59 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

లీజులు, అద్దెలపై జీఎస్టీ!

లీజులు, అద్దెలపై జీఎస్టీ!

- భూమి లీజు, నిర్మాణంలోని ఇంటి కొనుగోలుకు చెల్లించే ఈఎంఐలపై కూడా..
- భూమి, భవనాల అమ్మకాలకు మినహాయింపు.. జీఎస్టీ బిల్లుల్లో కేంద్రం ప్రతిపాదన


న్యూఢిల్లీ

భూమి లీజుకిచ్చినా, వాణిజ్య అవసరాల కోసం భవనాల్ని అద్దెకిచ్చినా జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) పన్ను చెల్లించాల్సిందే. నిర్మాణంలో ఉన్న ఇంటి కొనుగోలుకు చెల్లించే ఈఎంఐలకు కూడా జీఎస్టీ పన్నును అమలు చేస్తారు. ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీలో ఈ ప్రతిపాదనలు చేర్చడంతో... ఎంత పన్ను విధిస్తారోనని వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

అయితే భూమి, భవనాల అమ్మకాలకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. వాటిపై ఎప్పటిలానే స్టాంప్‌ డ్యూటీ కొనసాగనుంది. విద్యుత్‌ను కూడా జీఎస్టీ పరిధి నుంచి తప్పించారు. జీఎస్టీ బిల్లులపై పార్లమెంట్‌లో ఇంకా చర్చ ప్రారంభం కానందున ఈ నిబంధనలు కొనసాగిస్తారా లేక సవరణలు చేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. కేంద్ర ఎక్సైజ్‌ పన్ను, సేవా పన్ను, రాష్ట్రాల వ్యాట్‌లతో పాటు ఇతర పరోక్ష పన్నుల్ని రద్దు చేసి రూపొందించిన జీఎస్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ జూలై 1, 2017 నుంచి అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే..

సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగు బిల్లుల్లో ఒకటైన సీజీఎస్టీ(కేంద్ర జీఎస్టీ)లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. లీజు, అద్దె, ఇతరుల ఆస్తిపై హక్కు పొందడం, భూమి స్వాధీనానికి అనుమతి కలిగి ఉండడం వంటివి సేవలుగానే పరిగణిస్తారు. వ్యాపారం లేదా వాణిజ్యం కోసం... వాణిజ్య, పారిశ్రామిక, నివాస సముదాయాల్ని పూర్తిగా లేక పాక్షికంగా లీజు లేదా అద్దెకు ఇవ్వడాన్ని కూడా సీజీఎస్టీలో సేవలుగానే పేర్కొన్నారు. భూమి లేదా భవనం అమ్మకాల్ని వస్తు సరఫరాగా పరిగణించడంతో వాటిపై సేవా పన్నువసూలు చేయరు. నిర్మాణంలో ఉన్న భవనాల అమ్మకాలకు మాత్రం జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో రూపొందించిన జీఎస్టీ నమూనా బిల్లుల ప్రకారం గూడ్స్‌(వస్తువులు) అంటే నగదు, సెక్యూరిటీస్‌ తప్ప ఏదైనా చరాస్తి (దావా హక్కు కలిగి ఉండాలి)... వస్తువుల జాబితాలో చేరని వాటిని సేవలుగా పరిగణించడం తెలిసిందే.

మార్చి 31 సమావేశంలో నిర్ణయించే అవకాశం
పన్ను నిపుణుల సమాచారం మేరకు ప్రస్తుతం వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం చెల్లించే అద్దెలపై సేవా పన్ను విధిస్తున్నారు. నివాస సముదాయాలకు మాత్రం పన్ను నుంచి మినహాయింపు ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్లకు అక్కడి భూమి కనిష్ట విలువను పరిగణనలోకి తీసుకుని సేవా పన్ను విధిస్తున్నారని డెలాయింట్‌ హస్కిన్స్‌ సెల్స్‌ ఎల్‌ఎల్‌పీ సీనియర్‌ డైరక్టర్‌ ఎంఎస్‌ మణి చెప్పారు. మార్చి 31న జరిగే జీఎస్టీ సమావేశంలో ఈ అంశం చర్చకు వస్తుందని .. జీఎస్టీ శ్లాబులోని కనిష్ట పన్నును విధిస్తారా? లేక పస్తుతం అమలు చేస్తున్న భూమి కనిష్ట విలువపై పన్నును అనుమతిస్తారో వేచి చూడాలని అన్నారు. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలకు భూమి కనిష్ట విలువపై సేవా పన్ను విధించడం వల్ల సేవా పన్ను రేటు 18 శాతం నుంచి 8 శాతానికి తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీపై ఎలాంటి వివాదం తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తుందని నగీనా అండ్‌ కో డైరక్టర్‌ రజత్‌ మోహన్‌ చెప్పారు. భూమి లీజు, భవనాల అద్దె, వ్యాపార సముదాయం, భవనాల నిర్మాణం, సివిల్‌ నిర్మాణాలకు జీఎస్టీ వర్తిస్తుందనే విషయం ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement