టీ బిల్లును ప్రతిఘటిస్తాం : కావూరి
చింతలపూడి, న్యూస్‌లైన్: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రతిఘటిస్తామని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్‌కు విధేయుడనని, అలాగని ప్రజలకు నష్టం కలిగిస్తే పార్టీలో ఎంతటి వారిపై అయినా తిరగబడతానని పేర్కొన్నారు. విభజన దేశానికి మంచిదికాదని సోనియా సహా కేంద్ర మంత్రులకు పలుమార్లు హెచ్చరించామన్నారు.
బతికుంటే మహాత్ముడు సిగ్గుపడేవారు: కోట్ల
కోడుమూరు, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి కమల్‌నాథ్ నిండుసభలో గుండాగిరి చేశారని, ఈ ఘటన ప్రజాస్వామ్యానికే తలవంపని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. మహాత్మాగాంధీ బతికుంటే వీరి తీరుకు సిగ్గుపడేవారని అన్నారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగజారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు చెబుతున్నా పార్టీ పెద్దలకు చీమకుట్టినట్లైనా లేదన్నారు.
సీమాంధ్ర ఎంపీల తీరు సరిగాలేదు: పనబాక
బాపట్ల/పర్చూరు, న్యూస్‌లైన్: లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరు సరిగాలేదని కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ఆమె గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా పర్చూరులో విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి షిండే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడం చూశానన్నారు. బిల్లు ప్రవేశపెట్టేవరకు మౌనంగా ఉన్న లగడపాటి ఒక్కసారిగా పెప్పర్ స్ప్రే చేయడం, ముందుకు దూసుకెళ్లడం సరికాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమన్యాయమంటూ మాట్లాడటం సరికాదని విమర్శించారు. తాను బాపట్ల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తానన్నారు.
దారులు మూసుకుపోలేదు: జేడీ శీలం
అద్దంకి, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లు విషయంలో సీమాంధ్ర సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇంకా దారులు మూసుకుపోలేదని కేంద్ర మంత్రి జేడీ శీలం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో శనివారం మాట్లాడుతూ.. ‘‘నాలుగు రోజులు ఆగండి. అన్నీ తెలుస్తాయి. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించడానికి తెర వెనుక, ముందు చేయాల్సినవన్నీ చేస్తున్నాం. రెండు ప్రాంతాల వారి మనసులు విరిగిపోయాయి. ఏనాడైనా విడిపోవాల్సిందే. ఈ సమావేశాల్లో బిల్లు పాసవుతుందో లేదో చెప్పలేం’’ అని అన్నారు.
ఫుటేజీ రేపు బయట పెడతా: సబ్బం
సాక్షి, విశాఖపట్నం: లోక్‌సభలో నిజానికి ఎవరు ఎవరిపై దాడికి ప్రయత్నించారనే దానిపై దూరదర్శన్ వీడియో ఫుటేజీలను సోమవారం బయట పెడతానని ఎంపీ సబ్బం హరి ప్రకటించారు. దూరదర్శన్‌కు ఇప్పటికే ఈ మేరకు లేఖ రాశానని శనివారం చెప్పారు. అంతేగాక అత్యంత సంచలనాత్మకమైన ఒక అంశంపై సోమవారం నోరు విప్పుతానన్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆ అంశంపై లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు తానిప్పటికే ప్రశ్న పంపినా అదింకా సభలోకి రాలేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీమాంధ్ర ఎంపీలను సోనియా తన బలంతో, ఇతర రాష్ట్రాలకు చెందిన గూండా ఎంపీలతో దాడికి ఉసిగొల్పేందుకు పూనుకోవడం హేయమని సబ్బం అన్నారు. లోక్‌సభ స్పీకర్‌తోపాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు సోనియా ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని, వారు అచ్చం బానిసలను తలపిస్తున్నారని దుయ్యబట్టారు.
బీజేపీది ద్వంద్వవైఖరి: బలరాం నాయక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని కేంద్ర మంత్రి బలరాం నాయక్ విమర్శించారు. మాట నిలబెట్టుకుంటేనే బీజేపీకి గౌరవం దక్కుతుందన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని, పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు మినహా మిగతా ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంచాలని అన్నారు.
సస్పెన్షన్ ఎత్తేయాలి: సమైక్యాంధ్ర పోరాట కమిటీ
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 17న సీమాంధ్ర జిల్లాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సమైక్యాంధ్ర పోరాట కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఈనెల 21 వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ బిల్లుపై నేతల భిన్నాభిప్రాయాలు
Published Sun, Feb 16 2014 3:56 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement