శాంసంగ్ గెలాక్సీకి పోటీగా ఎల్జీ ఫోన్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ గెలాక్సీ నోట్7 కు పోటీగా దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇంక్ సెప్టెంబర్ లో కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురాబోతుంది. గతేడాది అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చిన వీ10 ఫోన్ల విజయంతో, వీ20 డివైజ్ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఎల్జీ వెల్లడించింది. ఈ కొత్త డివైజ్లు కంపెనీని నిరాశపరుస్తున్న అమ్మకాల నుంచి బయటపడేస్తాయని.. శాంసంగ్ గెలాక్సీ నోట్7కు పోటీగా నిలబడతాయని ఆశాభావం వ్యక్తంచేస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో గూగుల్ తాజా వెర్షన్ నోగట్తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ ఇదే కాబోతుందని తెలిపింది. అయితే ఈ వీ20 డివైజ్ ఎలా ఉండబోతుంది..ఏ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.. ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
ఎల్జీకి ప్రత్యర్థులుగా ఉన్న స్మార్ట్ఫోన్ రారాజులు శాంసంగ్, యాపిల్లు తమ కొత్త డివైజ్లను త్వరలోనే మార్కెట్లోకి ఆవిష్కరించబోతున్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన తర్వాతి గెలాక్సీ స్మార్ట్ఫోన్ను బుధవారం మార్కెట్లోకి తీసుకురాబోతుండగా.. యాపిల్ ఇంక్ తన కొత్త ఐఫోన్ను సెప్టెంబర్లో ప్రవేశపెట్టనుంది.
ఎల్జీ కలిగిఉన్న రెండు ప్రీమియం ఫోన్ సిరీస్లు, మార్చిలో లాంచ్ చేసిన జీ5 ఫోన్, ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలో అమ్మకాలు నమోదుచేసి కంపెనీని నిరాశపర్చాయి. దీంతో ఈ దక్షిణ కొరియా దిగ్గజం వరుసగా ఐదో త్రైమాసికం ఏప్రిల్-జూన్ కాలంలో కూడా నిర్వహణ నష్టాలనే నమోదుచేసింది. వీ10 డివైజ్ విజయంతో, కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్లోకి ఆవిష్కరిస్తామని ఎల్జీ ప్రకటించింది. ఈ కొత్త ప్రొడక్ట్, మూడో త్రైమాసికంలో తమ ప్రదర్శనను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తోంది.