సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి | LJP 'shocked' by seat sharing agreement, no rift with Manjhi: Chirag Paswan | Sakshi
Sakshi News home page

సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి

Published Wed, Sep 16 2015 1:50 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి - Sakshi

సీట్ల సర్దుబాటుపై ఎల్జేపీ అసంతృప్తి

అమిత్ షాతో చిరాగ్ భేటీ.. 43 మందితో బీజేపీ తొలిజాబితా
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఎన్డీయే మిత్రపక్షాల్లో అసంతృప్తి ప్రారంభమైంది. సీట్ల కేటాయింపుపై ఎన్డీయే మిత్రపక్షం లోక్‌జనశక్తి పార్టీ(ఎల్జేపీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. మొదట్లో హామీ ఇచ్చిన ప్రకారం తమకు సీట్లు కేటాయించకపోవడం నిరుత్సాహపరిచిందని పేర్కొంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న స్థానాల సంఖ్యపై ఎన్డీయే మిత్రపక్షాల్లో సోమవారం ఒక అవగాహన కుదిరిన విషయం తెలిసిందే.

దాని ప్రకారం బీజేపీ 160, ఎల్జేపీ 40, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం-ఎస్ 20, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహకు చెంది న ఆర్‌ఎల్‌ఎస్‌పీ 23 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ చిరాగ్ పాశ్వాన్ సోమవారం అర్ధరాత్రి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయి, తమ వాదనను ఆయనకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

‘మాకు గతంలో చెప్పిన సీట్ల కేటాయింపు ఫార్మూలాకు, నిన్నటి ప్రకటనకు తేడా ఉంది. అది మమ్మల్ని నిరుత్సాహపరిచింది. కోపమేం లేదు కానీ పార్టీలో అసంతృప్తి నెలకొంది. నిన్నటి ప్రకటనతో మేం షాక్‌కు గురయ్యాం’ అన్నారు. అయితే, ఎన్డీయేకు దూరం కాబోమని, బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమిత్ షా తమ పార్టీ ఆందోళనను అర్థం చేసుకున్నారని, త్వరలో దీనికో పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.

ఎల్జేపీకి కేటాయించిన స్థానాల సంఖ్యను పెంచేందుకు షా అంగీకరించారా? అన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. మాంఝీకి కేటాయించిన సీట్లపై తమకు అసంతృప్తి లేదని, ఏ ఫార్మూలా ప్రకారమైతే ఆర్‌ఎల్‌ఎస్‌పీకి 23 సీట్లు కేటాయించారో, అదే ఫార్మూ లా ప్రకారం తమకూ కేటాయింపు జరగాలన్నది తమ డిమాండ్ అన్నారు. సీట్ల సర్దుబాటులో మాంఝీ, కుష్వాహాల పార్టీలు ఎక్కువ లాభపడ్డాయని ఎల్జేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీతో మొదట కుదిరిన అవగాహన గురించి ఎల్జేపీ సీనియర్ నేత ఒకరు వివరించారు.

ఆ వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీ ఎంపీ స్థానంలోని 6 అసెంబ్లీ స్థానాలను ఎల్జేపీ, ఆర్‌ఎల్‌ఎస్‌పీలకు కేటాయిస్తామని బీజేపీ ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన ప్రకారం ఎల్జ్జేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 42, ఆర్‌ఎల్‌ఎస్‌పీకి 18 స్థానాలు దక్కాల్సి ఉంది. అలాగే, మాంఝీ పార్టీ హెచ్‌ఏఎం-ఎస్‌కు 12 సీట్లు కేటాయించాలనుకున్నారు.

ఆ 12లో.. 9 బీజేపీ, 2 ఎల్జేపీ, 1 ఆర్‌ఎస్‌ఎల్‌పీ త్యాగం చే యాలనుకున్నారు. అలా చేస్తే, ఎల్జేపీ 40, ఆర్‌ఎల్‌ఎస్‌పీ 17, హెచ్‌ఏఎం-ఎస్ 12 స్థానా ల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్తవ ప్రకటనలో ఆర్‌ఎల్ ఎస్పీ, హెచ్‌ఏఎంలకు ఎక్కువ రావడంతో పాశ్వాన్ అసంతృప్తి చెందారు. కాగా బీజేపీ 43మందితో మంగళవారం రాత్రి తొలి జాబితా విడుదల చేసింది.
 
మరిన్ని సీట్లిస్తే పొత్తుకు రెడీ: పవార్
సీట్ల కేటాయింపులో మెరుగైన ప్రాతినిధ్యం కల్పిస్తే బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మహా లౌకిక కూటమితో పొత్తుకు సిద్ధమేననిమంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్‌కి 40 స్థానాలు కేటాయించినప్పుడు, ఒక ఎంపీ ఉన్న తమకు కూడా అదే రీతిన సీట్లివ్వాలన్నారు. జేడీయూ, ఆర్జేడీలు చెరో 100 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేస్తూ.. ఎన్సీపీకి 3 సీట్లు కేటాయించిన విషయం, దాంతో కూటమి నుంచి ఎన్సీపీ వైదొలగిన విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement