హిట్లర్ మళ్లీ తిరిగొస్తే..!
తన యుద్ధోన్మాదంతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని.. నేటికి దాదాపు 70 ఏండ్లు. గడిచిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో జర్మనీ ఎన్నో మార్పులు చవిచూసింది. సరికొత్త రూపును, గుర్తింపును సంతరించుకుంది. హిట్లర్ జర్మనీ దురభిమానం, హింసకు ప్రతీకగా నిలబడితే.. ఆధునిక జర్మనీ హేతుబద్ధత, పునరుత్పాదకతకు ప్రతీకగా నిలబడింది.
ఒకవేళ హిట్లర్ బతికిఉంటే ప్రస్తుత జర్మనీ ఎలా తయారయ్యేది? అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుత జర్మన్లు హిట్లర్‌ను ఎలా మార్చేవారు?.. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలతో తెరకెక్కిన చిత్రం 'లుక్ వూ హీజ్ బ్యాక్'. తిముర్ వెర్మస్ 2012లో రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల 'లుక్ వూ హీజ్ బ్యాక్'ను అదేపేరుతో తాజాగా సినిమాగా తెరకెక్కించారు. నవలను యథాతథంగా తెరకెక్కించిన ఈ సినిమాను చూస్తే.. కొంత ఆశ్చర్యం, కొంత విభ్రమ కలుగకమానదు.
సాధారణ కథనంతో సినిమా ప్రారంభమవుతుంది. తాను ఆత్మహత్య చేసుకున్న బంకర్‌కు కొద్దిదూరంలో.. తూర్పు బెర్లిన్‌లోని ఓ హౌసింగ్ ప్రాజెక్టులో ఆశ్చర్యకరంగా హిట్లర్ మళ్లీ దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఓ టీవీ నిర్మాతతో పరిచయం పెంచుకొని.. వెంటనే మీడియా స్టార్ అయిపోయేందుకు ఒక వ్యూహాన్ని పన్నుతాడు. అయితే 1945 తర్వాత ప్రపంచం ఎంతగా మారిపోయిందో చూసి హిట్లర్ ఆశ్చర్యపోవడమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామిక ఆధునిక జర్మనీని చూసి సహజంగానే హిట్లర్ ఉడికిపోతాడు. జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెల్‌ను తిట్టిపోస్తాడు. జర్మనీ సంప్రదాయక భావాలకు మద్దతునిస్తున్న గ్రీన్ పార్టీ పట్ల మాత్రం హిట్లర్ కొంత సానుభూతి చూపిస్తాడు. అదేవిధంగా ప్రస్తుతం టీవీ చానెళ్లు సొంతంగా వండి వారుస్తున్న వార్తాకథనాలను చూసి.. 'ఔరా.. దీనిని గ్లోబెల్స్ కూడా చూడలేదే' అని హిట్లర్ బిత్తరపోతాడు. సెటైరికల్ కామెడీ తరహాలో సాగిన ఈ సినిమాలో హిట్లర్ పాత్రలో నటుడు ఒలివర్ మసుస్సి ఒదిగిపోయాడు. దర్శకుడు డేవిడ్ నెండెట్ తెరకెక్కించిన తీరు బాగుందని ప్రశంసలు లభిస్తున్నాయి.