పెద్దనోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో జోకులు హల్‌చల్ చేస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు ఈ విషయం మీద సెటైర్ల మీద సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజల కష్టాలు దృష్టిలో పెట్టుకొని మరికొందరు కేంద్రాన్ని తప్పుబడుతున్నారు. కానీ వీటన్నింటి కన్నా ఇటీవల ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టిన ఓ ‘లుంగీ క్యూ’ ఫొటో మాత్రం ‘లుంగీ డ్యాన్స్’ను మించి హల్‌చల్ చేస్తోంది. ఈ ఫొటోలో లుంగీలు కట్టుకున్న జనాలు రెండు క్యూలలో నిలిచి ఉండటం చూశారు కదా..! ఇందులోని ఒక క్యూ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి కాగా, మరొక క్యూ మందుబాబులది.
దీంతో ‘ప్రధానిగారు కేరళ నుంచి మీకో విజ్ఞప్తి: మద్యం షాపుల్లో పాత నోట్లనైనా తీసుకోమనండి లేదా బ్యాంకుల్లో మద్యాన్నైనా అమ్మండి. అంతేకానీ మేం రోజూ ఇలా రెండు క్యూలలో నిలుచోలేం’ అంటూ ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. ఫొటోలో మద్యం దుకాణం బోర్డు మీద మలయాళంలో ‘విదేశమద్యం’ అని రాసి ఉండటం చూడొచ్చు. ఇంకా విచిత్రమేమిటంటే ఏటీఎం ముందు కన్నా మందుబాబుల క్యూ పెద్దగా ఉండటం. నిజానికి ఈ ఫొటో కేరళ దినపత్రికల్లో వచ్చినదే.
కానీ, కోజికోడ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఓ ఆసక్తికరమైన కామెంట్‌తో ఈ ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. ఈ ఫొటోలో ఏటీఎంల ముందు నిలబడిన జనాలు మర్యాదగా లుంగీలు దించి నిలబడగా.. మరో క్యూలో మందుబాబులు లుంగీలు ఎత్తికట్టుకున్నారంటూ గుర్తించి ఆయన కామెంట్ పెట్టడం బాగా పేలింది. దేవాలయాలు, పవిత్ర ప్రదేశాలకు వెళ్లినప్పుడు లుంగీలు దించి మర్యాదగా కనిపించే సంప్రదాయం తెలిసిందే. అదే ఇతర చోట్లకు వెళితే లుంగీలు ఎత్తికట్టుకోవడం రివాజు. అదే ఈ ఫొటోలో కనిపిస్తోందన్నది నెటిజన్లు ఉవాచ. మొత్తానికి మద్యానికి ఉన్న డిమాండ్‌తోపాటు అది డిమానిటైజేషన్‌తో ఎలా పోటీ పడుతున్నదో చాటే ఈ ఫొటో ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.