రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని విభజిస్తే తలెత్తే పలు సమస్యలను రాష్ట్ర ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.సాహు కేంద్రానికి నివేదించారు.
* విద్యుత్ రంగంపై కేంద్రానికి సాహు నివేదిక
* విభజనతో ‘పీపీఏ’లు సమస్యగా మారతాయి
* ప్లాంట్ల విభజనపైనా అసంతృప్తులకు అవకాశం
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ రంగాన్ని విభజిస్తే తలెత్తే పలు సమస్యలను రాష్ట్ర ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.సాహు కేంద్రానికి నివేదించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా తదితర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలు, జరుగుతున్న సరఫరా, విద్యుత్ ప్లాంట్లు, ఉత్పత్తి సామర్థ్యం, వ్యయం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ట్రాన్స్‌కో పరిధిలో ఉద్యోగులు తదితర వివరాలను వారి ముందుంచారు.
బొగ్గు, జల, గ్యాస్ విద్యుత్ ప్లాంట్ల వివరాలను ప్రాంతాల వారీగా నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రాష్ట్రం లో వ్యవసాయ రంగానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌పై కేంద్ర అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. విద్యుత్ రంగం విభజనతో రాగల సమస్యలను మాత్రమే తాము వివరిస్తున్నామని.. అంతిమ నిర్ణయం కేంద్రానిదేనని సాహు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటయిన మంత్రుల బృందంలో జల వనరులు, విద్యుత్ పంపిణీ అంశాలను పర్యవేక్షిస్తున్న కేంద్రమంత్రి జైరాం రమేష్‌తో సాహు శనివారం భేటీ కానున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్రానికి నివేదించిన ప్రధాన సమస్యలివీ...
* రాష్ట్రంలో నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఉన్నాయి. జెన్‌కోతో పాటు ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లతో నాలుగు డిస్కంలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) కుదుర్చుకున్నాయి. విభజన అనంతరం ఈ పీపీఏలు సమస్యగా మారే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లు ఆ ప్రాంతానికే అని విభజించిస్తే.. పీపీఏల సమస్య తెరమీదకు వస్తుంది. ప్రధానంగా ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లకు నాలుగు డిస్కంలతో ఉన్న పీపీఏలను సదరు ప్రాంతంలోని డిస్కంలకు మాత్రమే పరిమతం చేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశముంది.
* తెలంగాణలోని కొన్ని ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తక్కువ. ఎందుకంటే బొగ్గు అందుబాటులో ఉండటంతో పాటు ప్రధానంగా కొత్తగూడెం విద్యుత్ ప్లాంటుకు తెచ్చిన రుణం తీరిపోయింది. రాయలసీమలోని ఆర్‌టీపీపీ ప్లాంటు విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. ఇందుకు కారణం బొగ్గు సరఫరాకు అయ్యే అదనపు వ్యయంతో పాటు కొత్త ప్లాంట్లు కావడం వల్ల రుణం ఇంకా చెల్లించాల్సి ఉండటం. ఏ ప్రాంతంలోని ప్లాంట్లు అక్కడికే అంటే విద్యుత్ ఉత్పత్తి వ్యయం అధికంగా ఉన్న ప్లాంట్లను తమకు అప్పగించారనే విమర్శలు వచ్చే అవకాశముంది.
* ఏ ప్రాంతంలోని ప్లాంట్లు అక్కడికే అంటే.. ఒక ప్రాం తానికి అధిక సామర్థ్యం, మరో ప్రాంతానికి తక్కువ సామర్థ్యం వస్తుంది. దీంతో తక్కువ సామర్థ్యం ఉన్న ప్రాంతం.. అదనపు విద్యుత్‌ను కోరే అవకాశం ఉంది.
* వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలతో (ఎన్‌టీపీసీ, నైవేలీ) కుదుర్చుకున్న పీపీఏలను కూడా తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది.
* జూరాల వద్ద ఉన్న ఒక మెగావాటు సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంటుతో కేవలం సీపీడీసీఎల్ మాత్రమే పీపీఏ కుదుర్చుకుంది. ఫలితంగా ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.