'ఆ ఎంపీని బహిష్కరించాల్సిందే'
కోల్ కతా: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్టీయ జనతాదళ్ పార్టీ(ఆర్ఎల్డీ)నేత అమర్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తృణమూల్ కాంగ్రెస్ కు అపార నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్న ఆమె.. ఆ ఎంపీని పార్టీ నుంచి బయటకు పంపకపోతే రాబోవు రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని విమర్శించారు. ఆర్ఎల్డీ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ఆ ఎంపీపై తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అడిగిన ప్రశ్నకు మండిపడ్డారు.
' మహిళా నేతగా ఉన్న ఆమె సాటి మహిళలపై ఆరోపణలు చేసిన తపస్ పాల్ చర్యలు చేపట్టాలి. తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించడమే ఇందుకు మార్గం' అని అమర్ సింగ్ తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం సరైన పద్దతి కాదన్నారు. 'అతనొక మానసిక వికలాంగుడు. చాలా చెడు వ్యక్తి. పాల్ నుంచి ఒక్క క్షమాపణ ఆశించడం సరికాదు. పార్టీ బహిష్కరణ ఒక్కటే తగిన చర్య'అని ఆయన స్పష్టం చేశారు.ఇకనైనా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.