Tapas Pal
-
సీబీఐ వేధింపులతోనే ఆ నేత మరణం..
కోల్‌కతా : కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ నటుడు తపస్ పాల్ గుండెపోటుతో మరణించారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ ఒత్తిళ్లతో ఇటీవల ముగ్గురు మరణించారని ఆమె అన్నారు. తృణమూల్ మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ తొలుత మరణించగా, పార్టీ ఎంపీ ప్రసూన్ బెనర్జీ తర్వాత కన్నుమూయగా తాజాగా తపస్ పాల్‌ను కేంద్రం బలిగొందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వేధింపులు, రాజకీయ కక్షసాధింపు చర్యలతోనే వీరు ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా తపస్ పాల్ (61) గుండెపోటుతో ముంబై ఆస్పత్రిలో మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. తపస్ పాల్ హఠాన్మరణంపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం పతాకస్ధాయికి చేరింది. తపస్ పాల్ తృణమూల్ కాంగ్రెస్ చేసిన పాపాలకు బలిపశువు అయ్యారని బీజేపీ తృణమూల్ ఆరోపణలను తిప్పికొట్టింది. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన తపస్ పాల్ దీర్ఘకాలంగా గుండె, నరాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా పలుసార్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. డిసెంబర్ 2016 రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కేసుకు సంబంధించి సీబీఐ గతంలో ఆయనను అరెస్ట్ చేసింది. చదవండి : ఢిల్లీ ఫలితాలు : ‘2021లో ఏం జరుగుతుందో చూడండి’ -
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మృతి
కోల్‌కతా: బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తపస్‌పాల్ (61) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్‌పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు.. విమానాశ్రయంలో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. తపస్‌పాల్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా తపస్‌పాల్ గుండె జబ్బుల కారణంగా పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. తపస్పాల్‌కు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. కాగా తపస్‌పాల్ పశ్చిమ బెంగాల్‌లోని చందన్నగర్లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్ కాలేజీలో బయోసైన్స్ చదివారు. సినిమాల మీద మక్కువతో ..1980లో దర్శకుడు తరుణ్ మజుందార్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1984లో తపస్‌పాల్.. మాధురీ దీక్షిత్‌తో కలిసి అబోద్ చిత్రంలో నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా తపస్‌పాల్ రాజకీయాల్లో కూడా రాణించారు. ఆయన తృణముల్ కాంగ్రెస్‌లో ఎంపీగా గెలిచి సేవలందించారు. -
మమతా బెనర్జీకి కేంద్రం షాక్
కోల్‌కతా: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో టీఎంసీ ఎంపీ తపస్ పాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. శుక్రవారం కోల్‌కతాలో కొన్ని గంటల పాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. రోజ్ వ్యాలీ కంపెనీలో తపస్ పాల్ డైరెక్టర్‌గా ఉన్నారు. 17 వేల కోట్ల రూపాయల మేరకు వేలాది మందిని మోసం చేసినట్టు రోజ్ వ్యాలీపై ఆరోపణలు వచ్చాయి. రోజ్ వ్యాలీ నుంచి పాల్ లబ్ధి పొందినట్టు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇదే కేసుకు సంబంధించి టీఎంసీకి చెందిన మరో ఎంపీ సుదీప్ బందోపాధ్యాయకు సీబీఐ సమన్లు జారీ చేసింది. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున కేంద్రం సీబీఐని అడ్డుపెట్టుకుని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. -
'భూమి ఉన్నన్నాళ్లు రేప్‌లు ఉంటాయి'
'అత్యాచారాలు ఇంతకు ముందు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి.. గట్టిగా చెప్పాలంటే భూమి ఉన్నన్నాళ్లు ఉంటూనే ఉంటాయి'.. ఇదీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి ఉవాచ. డైమండ్ హార్బర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హల్దర్ ఓ బహిరంగ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే.. ప్రజల్లో అవగాహన కల్పించలన్నది మాత్రమే తన ఉద్దేశం తప్ప వేరేది కాదంటూ నాలుక కొరుక్కునే ప్రయత్నం చేశాడు. ''దయచేసి పాత్రికేయులు నా వ్యాఖ్యలను సందర్భరహితంగా తీసుకోవద్దు. నేనేమన్నాను? అత్యాచారాలను నేను సమర్థించలేదు. ఇది సామాజిక సమస్య అని, కేవలం ఒక్క మమతా బెనర్జీ మాత్రమే దీన్ని పరిష్కరించలేరని చెప్పాను. మనమంతా సమష్టిగా కృషిచేసి ఇలాంటివ జరగకుండా అడ్డుకోవాలి. మీరంతా దానిపై నిరసన తెలపాలి'' అని వివరించాడు. అయితే.. హల్దర్ వ్యాఖ్యలపై మాత్రం విపరీతమైన దుమారం రేగింది. తృణమూల్ నాయకులు పదే పదే అత్యాచారాలపై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని, వాళ్ల మనస్తత్వాన్ని ఇది సూచిస్తుందని సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి విమర్శించారు. అసలు వాళ్లకు మాట్లాడటం ఎలాగో రాదని కాంగ్రెస్ నేత అబ్దుల్ మన్నన్ మండిపడ్డారు. ఇంతకుముందు కూడా అత్యాచారాలపై తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'సీపీఎం వాళ్లు మా కార్యర్తల వెంట్రుక మీద చెయ్యేసిన సరే.. వాళ్ల ఆడాళ్లను రేప్ చేయాలని మావాళ్లకు చెబుతాను' అని ఎంపీ తపస్ పాల్ ఇంతకుముందు అన్నారు. -
పార్లమెంట్ వెలుపల గందరగోళం
న్యూఢిల్లీ : పార్లమెంట్ వెలుపల సోమవారం గందరగోళం ఏర్పడింది. తృణమూల్ ఎంపీ తపస్ పాల్‌ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలంటూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎంపీకి చట్టసభలో కొనసాగే అర్హత లేదని ఉద్యమకారులు మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం తపస్‌పాల్ సీపీఐ మహిళ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
'ఆ ఎంపీని బహిష్కరించాల్సిందే'
కోల్ కతా: మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని రాష్టీయ జనతాదళ్ పార్టీ(ఆర్ఎల్డీ)నేత అమర్ సింగ్ డిమాండ్ చేశారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తృణమూల్ కాంగ్రెస్ కు అపార నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఉన్న ఆమె.. ఆ ఎంపీని పార్టీ నుంచి బయటకు పంపకపోతే రాబోవు రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని విమర్శించారు. ఆర్ఎల్డీ పార్టీ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ఆ ఎంపీపై తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిపై అడిగిన ప్రశ్నకు మండిపడ్డారు. ' మహిళా నేతగా ఉన్న ఆమె సాటి మహిళలపై ఆరోపణలు చేసిన తపస్ పాల్ చర్యలు చేపట్టాలి. తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించడమే ఇందుకు మార్గం' అని అమర్ సింగ్ తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించడం సరైన పద్దతి కాదన్నారు. 'అతనొక మానసిక వికలాంగుడు. చాలా చెడు వ్యక్తి. పాల్ నుంచి ఒక్క క్షమాపణ ఆశించడం సరికాదు. పార్టీ బహిష్కరణ ఒక్కటే తగిన చర్య'అని ఆయన స్పష్టం చేశారు.ఇకనైనా పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. -
'నరేంద్ర మోడీ సర్కార్ విఫలం'
విజయవాడ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ విరుచుకుపడ్డారు. దేశంలో ధరలను నియంత్రించడంలో మోడీ సర్కార్ విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. ప్రకాశ్ కారత్ శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంధన ధరలపై నియంత్రణ ఎత్తివేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పెరిగిన రైల్వే ఛార్జీలపై ప్రజలపై భారం వేశారని, త్వరలోనే ఎల్పీజీ గ్యాస్, డీజిల్ ధరలు పెంచేందుకు మోడీ సర్కార్ సన్నాహాలు చేస్తుందన్నారు. మోడీ చెబుతున్న కఠిన నిర్ణయాలు ప్రజలపై భారం మోపేందుకేనని... గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు తర్వాత లెప్ట్ పార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ప్రకాశ్ కారత్ వ్యాఖ్యానించారు. తృణమూల్ ఎంపీ తపస్ పాల్ వ్యాఖ్యలు క్షమాపణలతో పూర్తి కాలేదని పార్లమెంటులో దీనిపై పోరాడతామని ఆయన అన్నారు. -
వదంతులకు వేగం ఎక్కువ: మమత
కోల్‌కతా: వదంతులు వ్యాపించినంత వేగంగా మంచి వార్తలు జనంలోకి వెళ్లడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాపోయారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు గురించి ఎవరూ చెప్పుకోవడం లేదని అన్నారు. చిన్న విషయాలను మాత్రం పెద్దవి చేసి చూపుతున్నారని పేర్కొన్నారు. "మంచి పనులు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఏమీ లాభం లేకపోయినప్పటికీ చిన్న విషయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మన ప్రమేయం లేకపోయినప్పటికీ వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి' అని మమత వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
పాల్ బేషరతు క్షమాపణకు ఒకే
కోల్‌కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చేయిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ తపస్ పాల్ బేషరతుగా చెప్పిన క్షమాపణను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని పేర్కొంది. బేషరతు క్షమాపణలు చెబుతూ తపస్ పాల్ రాసిన లేఖ విచారం వ్యక్తపరిచేలా ఉందని, ఈ వివాదం ముగిసిందని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ పేర్కొన్నారు. పార్టీ మాత్రమే కాకుండా బెంగాల్ ప్రజలకు, బెంగాల్ మహిళలకు, తన కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. -
ఆయనను చంపాలని కోరుకుంటున్నారా?
డైమండ్ హార్బర్: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు పొరపాటే కాదని, ముమ్మాటికీ తప్పు అని అన్నారు. ఆయనపై తగిన చర్య తీసుకుంటామని తెలిపారు. తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలకు ఆయనను చంపేయాలా అంటూ మమత ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగించింది. "తపస్ పాల్ వ్యాఖ్యలు పారపాటు. పెద్ద తప్పు. ఆయనపై ఏమేం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు. దీనికి ఆయనను నేను చంపాలని కోరుకుంటున్నారా. ఏం చేయాలో అది చేస్తాం. దీనికి ఒక విధానమంటూ ఉంది' అని విలేకరులతో మమతా బెనర్జీ అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని తపస్ పాల్ ను మమత ఆదేశించారు. -
తపస్ పాల్ ను బహిష్కరించండి
న్యూఢిల్లీ: సీపీఎం కార్యకర్తలను బెదిరించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని జాతీయ మహిళా సంఘం డిమాండ్ చేసింది. మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన మహిళా సంఘం పాల్ ను నోటీసు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. పాల్ పై మమతా బెనర్జీ చర్య తీసుకోవాలని జాతీయ మహిళా సంఘం అధ్యక్షురాలు మమత శర్మ డిమాండ్ చేశారు. తమ పార్టీకి చెందిన ఒక్క కార్యకర్తపై దాడి జరిగినా.. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తలను హతమారుస్తామని, వారి మహిళలపై అత్యాచారాలు చేయాలని తమ కార్యకర్తలకు పురికొల్పుతానని సీపీఎం నేతలను హెచ్చరిస్తూ తపస్ పాల్ చేసిన ప్రసంగం తాలూకూ వీడియోను ఓ స్థానిక టీవీ చానల్ ప్రసారం చేయడంతో ఆయనపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.