
కత్తితో తెగబడిన ఉన్మాది
- గంజాయి, వైట్‌నర్ మత్తులో దారిన పోయేవారిపై దాడి
- ఒకరు మృతి... ఇద్దరికి తీవ్రగాయాలు
- హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఘటన
- పోలీసుల అదుపులో నిందితుడు
హైదరాబాద్: గంజాయి, వైట్‌నర్ సేవించిన మత్తులో ఉన్మాదిలా మారిన ఓ ఆటోడ్రైవర్ తెగబడ్డాడు. కత్తి చేతపట్టి దారినపోయే నలుగురిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఓ యువకుడు మృతిచెందగా... మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బీటీనగర్ బస్తీలో బుధవారం తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలివి... సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఎన్బీటీనగర్‌లో బస్తీవాసులు బాలరాజు(26), మహేశ్(35), జగన్(20), జానీమియా అలియాస్ బబ్లూ(18)లు నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో స్థానిక కల్లు దుకాణం సమీపంలోని సయ్యద్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ అర్బాజ్(20) ఉన్నట్టుండి కత్తితో వారిపై దాడికి దిగాడు. గంజాయి మత్తులో ఉన్న అతడు అందిన చోటల్లా పొడిచి పరారయ్యాడు. ఈ క్రమంలో బబ్లూ కడుపులో తీవ్ర కత్తిపోట్లు పడ్డాయి. బాలరాజు, మహేశ్‌లకు తీవ్రంగా, జగన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
వారిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ బబ్లూ మృతి చెందాడు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఆటో నడుపుకొనే అర్బాజ్ ఎప్పుడూ అల్లరిచిల్లరగా తిరిగేవాడని, గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో గాలించిన ప్రత్యేక బృందం నిందితుడు అర్బాజ్‌ను అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి దాడికి ఉపయోగించిన పదునైన కత్తి, వైట్‌నర్ స్వాధీనం చేసుకున్నారు. దాడి చేసే సమయంలో నిందితుడు గంజాయితో పాటు వైట్‌నర్ కూడా సేవించివున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తున్నారు.