మీకు డ్రైవింగ్ రాదా.. ఈయన గురించి తెలుసుకోండి!
దేశంలో ప్రతిరోజూ చాలామంది డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ పరీక్షల్లో పాసై లైసెన్స్ కూడా పొందుతారు. కొంతమంది మాత్రం డ్రైవింగ్ నేర్చుకోవడానికి నానాతంటాలు పడుతుంటారు. అలాంటి వారికి 45 ఏళ్ల అగ్నిహోత్రి స్ఫూర్తి అని చెప్పవచ్చు. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన అరుదైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రెండు చేతులూ లేకపోయినా కాళ్లతో వాహనాన్ని నడుపుతూ ఆయన తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. కాళ్లతో నడుపుతూ లైసెన్స్ పొందిన దేశంలోని దాదాపు మొదటి వ్యక్తిగా అగ్నిహోత్రి ఘనత సొంతం చేసుకున్నారు.
ఇండోర్‌కు చెందిన అగ్నిహోత్రి సకంల్పానికి వైకల్యం అడ్డుకాదని చాటారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చే వక్త అయిన ఆయన.. ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చేస్తున్నారు. సొంతంగా ఓ గ్యాస్ ఏజెన్సీని నడుపుతున్నారు. ఆయన వాహనాన్ని నడిపేందుకు గతంలో డ్రైవర్ ఉండేవారు. కానీ, ప్రాథమిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకూడదనేది ఆయన పాలసీ. అందుకే మొక్కవోని సంకల్పంతో రెండు చేతులూ లేకున్నా డ్రైవింగ్ నేర్చుకున్నారు. చేతులు లేకున్నా ఆయన డ్రైవింగ్ ఎలా చేస్తారనేది కొంతమందికి సందేహం రావొచ్చు. కానీ ఆయన కుడికాలితో స్టీరింగ్‌ను కంట్రోల్ చేస్తూ.. ఎడుమ కాలితో ఆక్సిలరేటర్‌ను ఉపయోగిస్తూ.. ఆటోమేటిక్ గేరు కారును నడుపుతారు. అగ్నిహోత్రి డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తును రవాణాశాఖ పలుమార్లు తిరస్కరించింది.
ఈ నేపథ్యంలో తనకు అనుగుణంగా ఉండేవిధంగా కారును రూపొందించుకొని.. డ్రైవింగ్ టెస్టుల్లో దానిని విజయవంతంగా నడిపి.. అగ్నిహోత్రి ఈ ఘనత సాధించారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరికి వరుసగా వినతిపత్రాలు ఇస్తూ పోయిన ఆయన.. ఎట్టకేలకు సెప్టెంబర్ 30వ తేదీన శాశ్వత లైసెన్స్ సాధించారు. రోడ్డు మీద ఎంతోమంది ఇప్పటికే వాహనాలు నడిపించడానికి నానా తంటాలు పడుతుంటారు. కానీ, అగ్నిహోత్రి మాత్రం రెండు చేతులూ లేకపోయినా ఇప్పటివరకు 14,500 కి.మీ దూరాన్ని ఎలాంటి విజయవంతంగా ఎలాంటి ప్రమాదాలు చేయకుండా నడిపారు. త్వరలో జమ్ముకశ్మీర్‌లోని లెహ్ వరకు తానే వాహనాన్ని నడుపుతూ వెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.