స్పైస్‌జెట్‌లో మళ్లీ అజయ్ ప్రయాణం
వాటా విక్రయించి దిగిపోతున్న మారన్
డీల్ విలువ దాదాపు రూ.1,500 కోట్లు
వచ్చే ఏడాదికి బ్రేక్ ఈవెన్ సాధించేలా ప్రణాళిక
కొన్ని విమానాలు, ఉద్యోగాల్లో సైతం కోత
పెట్టుబడుల కోసం విదేశీ ఇన్వెస్టర్లతో చర్చలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లోకి మళ్లీ పాత ప్రమోటర్ అజయ్‌సింగ్ ప్రవేశించారు. దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో ప్రస్తుతం కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ గ్రూపునకు ఉన్న వాటాలు మొత్తాన్ని కొనుగోలు చేయడానికి అజయ్ నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా డీల్ పూర్తి కావచ్చని సమాచారం. అయితే ఈ ఒప్పందానికింకా నియంత్రణ సంస్థలు అనుమతివ్వాల్సి ఉంది. తాను పెట్టుబడి పెట్టడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్లతో పెట్టుబడులు పెట్టించి, సంస్థకు కొత్త ఊపిర్లూదేందుకు అజయ్ సింగ్ అయిదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది.
స్పైస్‌జెట్ బోర్డు ఆమోదించిన పునరుద్ధరణ స్కీమ్ ప్రకారం ప్రస్తుత ప్రమోటర్ కళానిధి మారన్ కుటుంబం, కాల్ ఎయిర్‌వేస్ యాజమాన్య, నియంత్రణ బాధ్యతలన్నీ సింగ్‌కు బదిలీ అవుతాయి. మారన్ కుటుంబం తమకున్న మొత్తం ఈక్విటీ వాటాలను ఆయనకు బదలాయిస్తుంది. అయితే మున్ముందు తమ వద్దనున్న వారంట్లను వాటాలుగా మార్చుకుని, 10 శాతం వాటాలతో మైనారిటీ ఇన్వెస్టరుగా మాత్రం కొనసాగుతుంది. గతేడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం మారన్ కుటుంబానికి 53.48 శాతం వాటాలు ఉన్నాయి.
పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక...
యాజమాన్య బదలాయింపు, పునరుద్ధరణ ప్రణాళికను పౌర విమానయాన శాఖకు సమర్పించినట్లు అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ ఆర్థిక పరిస్థితిని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపర్చేలా దీన్ని రూపొందించామన్నారు. బంబార్డియర్ క్యూ400 విమానాలను దశల వారీగా పక్కనపెట్టడం కూడా ఈ ప్లాన్‌లో భాగమే. దీనికి ఆమోదముద్ర లభించాక అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం 41 బోయింగ్-14 బొంబార్డియర్ విమానాలతో కార్యకలాపాలు ఒక మోస్తరుగా నడుస్తున్నాయని.. క్రమంగా ఫ్లయిట్ సర్వీసులు పెంచడంపై దృష్టి పెడతామని సింగ్ చెప్పారు. స్పైస్‌జెట్ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా లాభదాయకం కాని రూట్లతో పాటు కొన్ని ఉద్యోగాల్లో కూడా కోత విధించాల్సి రావచ్చని తెలిపారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 5,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జేపీ మోర్గాన్‌తో కూడా ఇన్వెస్ట్‌మెంట్ కోసం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
2005లో ఏర్పాటయ్యాక స్పైస్‌జెట్ యాజమాన్యం మారడం ఇది మూడోసారి. 2005లో ప్రవాస భారతీయుడు కన్సాగ్రా కుటుంబంతో కలిసి సింగ్ స్పైస్‌జెట్‌ను ఆరంభించాక అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ విల్బర్ రాస్ మెజారిటీ వాటాలు కొన్నారు. 2010లో ఆ వాటాలను మీడియా దిగ్గజం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుటుంబానికి విక్రయించారు. మారన్ స్పైస్‌జెట్‌లో దాదాపు రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో సగ భాగాన్ని కంపెనీ కొనుగోలు కోసం వెచ్చించారు. తాజాగా మారన్ కుటుంబం నిష్ర్కమిస్తుండటంతో.. వ్యవస్థాపక ప్రమోటర్ సింగ్ మరోసారి కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో స్పైస్‌జెట్ నష్టాలు రూ. 246 కోట్లు.