మైక్రోసాఫ్ట్.. ఓ కొండ కరుగుతోంది! | Microsoft market value decreases to half | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్.. ఓ కొండ కరుగుతోంది!

Published Tue, Nov 5 2013 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

మైక్రోసాఫ్ట్.. ఓ కొండ కరుగుతోంది!

మైక్రోసాఫ్ట్.. ఓ కొండ కరుగుతోంది!

1999లో 616 బిలియన్ డాలర్లుగా ఉన్న మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఇపుడు సగానికిపైగా పడిపోయి 298 బిలియన్ డాలర్ల దగ్గరుంది.

అంతకంతకూ తగ్గిపోతున్న మైక్రోసాఫ్ట్
పదిహేనేళ్లలో సగానికిపైగా తగ్గిన కంపెనీ విలువ
అదే సమయంలో 80 రెట్లు పెరిగిన పోటీదార్లు
కొత్త ఆవిష్కరణలతో గూగుల్, యాపిల్‌ల సవాలు
మైక్రోసాఫ్ట్‌కు మాత్రం ఫెయిల్యూర్ స్టోరీలే అధికం
ఇప్పటికీ పీసీల్లో వాడే విండోస్, ఆఫీస్‌లే ఆధారం
ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్ల రాకతో పీసీలకే గడ్డుకాలం

 
 ఇంటికో కంప్యూటర్. కంప్యూటర్లో విండోస్. ఎంతసేపూ ఇదేనా? అవును ఇదే!! కొన్ని దశాబ్దాల పాటు సాగిందిదే. విండోస్‌ను సృష్టించినందుకు మైక్రోసాఫ్ట్‌కు దక్కిన కీర్తి అంతా ఇంతా కాదు. కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచంలో అత్యంత సంపన్నమైన కంపెనీ ఇదే. ప్రపంచ కుబేరుల్లో నంబర్-1 దీని వ్యవస్థాపకుడు బిల్ గేట్సే. కానీ ఎన్నాళ్లని అదే విండోస్‌లో కూర్చుంటారు జనం. అందుకే గూగుల్ తెచ్చిన ఆండ్రాయిడ్‌కు గులామైపోయారు. కంప్యూటర్లు పక్కనపెట్టి ట్యాబ్లెట్లు, ఫ్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందుకున్నారు. మైక్రోసాఫ్ట్‌కు పెద్ద కష్టమే వచ్చింది. దాని వైభవమంతా ‘లాంగ్ లాంగ్ ఎగో’కు మారే ప్రమాదం కనిపిస్తోంది!!
 
విండోస్‌కు ఎదురులేనన్నాళ్లు ఓకే. కానీ గూగుల్‌తో పరిస్థితి మారింది. గూగుల్ సెర్చింజిను ప్రపంచానికి ఫేవరెట్ అయింది. పోటీగా మైక్రోసాఫ్ట్ తయారు చేసిన ‘బింగ్’ మాత్రం... చతికిలబడింది. ఈ-బుక్స్, మ్యూజిక్‌లోనూ చుక్కెదురే. ఫలితమేంటంటే... 1999లో 616 బిలియన్ డాలర్లుగా ఉన్న మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ఇపుడు సగానికిపైగా పడిపోయి 298 బిలియన్ డాలర్ల దగ్గరుంది. ప్రత్యర్థి కంపెనీ యాపిల్ అప్పట్లో 5 బిలియన్ డాలర్లు కాగా... 80 రెట్లు పెరిగి 400 బిలియన్ డాలర్ల స్థాయిని చేరింది. గూగుల్ మార్కెట్ క్యాప్ సైతం మైక్రోసాఫ్ట్‌ని మించి 341 బిలియన్ డాలర్లను చేరింది. ఒక్క ఐ-ఫోన్‌తో యాపిల్ చరిత్ర మారిపోగా... ఆండ్రాయిడ్, యూట్యూబ్, క్రోమ్, గూగుల్ బుక్స్ సహా పలు ఆవిష్కరణలతో గూగుల్ తిరుగులేని స్థాయిని చేరింది. గతేడాది మార్చి త్రైమాసికంలో ఒక్క ఐఫోన్ అమ్మకాలు 22.7 బిలియన్ డాలర్లు కాగా... మైక్రోసాఫ్ట్ మొత్తం అమ్మకాలు 17.4 బిలియన్ డాలర్లే. ఒకనాడు కంప్యూటర్ రంగంపై ఐబీఎం ఆధిపత్యానికి గండి కొట్టిన మైక్రోసాఫ్ట్... ఇపుడు తానూ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోందంటే అది స్వయంకృతమే!!.
 
పోటీలో వెనకబాటు...
ఒకటిరెండు ఉత్పత్తులతోనే యాపిల్ ఠారెత్తిస్తోంది. గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులు తెస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లు మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కి పోటీ లేదు. కానీ గూగుల్ డాక్స్ (డాక్యుమెంట్స్) వచ్చాక పోటీ మొదలైంది. అలాగే ఎంత తక్కువ ఫీచర్లున్నా కొన్ని దశాబ్దాల పాటు ఇంటర్నెట్ బ్రౌజర్ అంటే ఎక్స్‌ప్లోరరే. కానీ గూగుల్ క్రోమ్ వచ్చాక దానికి నూకలు చెల్లాయి. ఇక విండోస్‌ని చావుదెబ్బ తీయటానికి క్రోమ్ పేరిట ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా తెస్తోంది గూగుల్. 2001లో యాపిల్ ఐపాడ్ తెచ్చింది. పోటీగా 2006లో మైక్రోసాఫ్ట్ జూన్ మ్యూజిక్ ప్లేయర్‌ని తెచ్చింది. కానీ రెణ్నెల్లు కూడా తిరక్కముందే మ్యూజిక్ ప్లేయరు, మొబైల్ ఫోనూ, ఇంటర్నెట్, కెమెరా వంటి అనేక సదుపాయాలతో యాపిల్ ఐఫోన్‌ని తెచ్చింది. జూన్ అటకెక్కింది.
 
విండోస్, ఆఫీస్ తప్ప ఏమీ లేవు...
మైక్రోసాఫ్ట్ ప్రధానంగా ఆధారపడింది విండోస్, ఆఫీస్, సర్వర్ల మీదే. విండోస్ ఎక్స్‌పీ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అమ్మకాలే కంపెనీకి ప్రధానాధారం. పర్సనల్ కంప్యూటర్స్ విభాగంలో మైక్రోసాఫ్ట్ ఇప్పటికీ కింగే కానీ... ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్ల రాకతో జనం పీసీలే వద్దనుకుంటున్నపుడు దాని భవిష్యత్తేంటన్నది ప్రశ్న. నిజానికి విండోస్, ఆఫీస్‌లపై విపరీతమైన మమకారం వల్లే మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీల్లో రాణించలేదన్న వాదనలున్నాయి. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి స్టీవ్ స్టోన్ గతంలో ‘‘మైక్రోసాఫ్ట్‌కు విండోస్ ఒక దైవం. అది తయారు చేసే ఏ ఉత్పత్తయినా విండోస్ చుట్టూనే తిరుగుతుంది’’ అన్నారంటే పరిస్థితి తెలియకమానదు. ఆ ధోరణే మైక్రోసాఫ్ట్‌కు శాపంగా మారిందనుకోవాలి. ఎందుకంటే 1998లోనే మైక్రోసాఫ్ట్ సిబ్బంది ఇ-రీడర్‌ని డెవలప్ చేశారు. కానీ, దాని యూజర్ ఇంటర్ ఫేస్... విండోస్‌కి తగ్గట్లు లేదంటూ స్వయంగా బిల్ గేట్స్ రిజెక్ట్ చేశారు. తరవాత ఈ-రీడర్లు ఎంత హిట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. అలాగే, ఎంఎస్‌ఎన్ మెసెంజర్‌లో స్టేటస్ అప్‌డేట్ అనే చిన్న ఫీచర్ పెట్టి ఉంటే... ఫేస్‌బుక్ ఇంత వేగంగా ఎదిగేది కాదన్నది మరికొన్ని వర్గాల మాట. ఈ ఐడియా అప్పట్లోనే ఒక ప్రోగ్రామర్ ఇచ్చినా... గేట్స్ కొట్టిపారేశారట. పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ (పీడీఏ) వంటి ప్యాకెట్ డివైజ్‌ల కోసం ఉద్దేశించిన విండోస్ సీఈ ఆపరేటింగ్ సిస్టం ఆ కోవకి చెందినదే. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుని ఉంటే నేటి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, స్మార్ట్‌ఫోన్లలో మైక్రోసాఫ్ట్‌కే ఆధిపత్యం ఉండేదంటారు విశ్లేషకులు. అంటే గతంలోనే ఎన్నో టెక్నాలజీలను ఆవిష్కరించినప్పటికీ... విండోస్‌లో కూర్చుని వాటిని పక్కకు తోసేసిం దన్న మాట మైక్రోసాఫ్ట్.
 
నోకియాతో డీల్ కలిసొస్తుందా?
ఈ మధ్య నోకియా హ్యాండ్‌సెట్ బిజినెస్‌ని దాదాపు 720 కోట్ల డాలర్లు చెల్లించి మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. దీనివల్ల కొంతైనా నిలదొక్కుకోవచ్చన్నది మైక్రోసాఫ్ట్ ఆలోచన. కానీ నోకియాదీ మైక్రోసాఫ్ట్ లాంటి చరిత్రే. ఒకప్పుడు మొబైల్ అంటే నోకియానే. కానీ స్మార్ట్‌ఫోన్ల రాకతో నోకియా పరిస్థితి తారుమారైంది. హైఎండ్‌లో యాపిల్, శాంసంగ్‌లు... లో ఎండ్  మార్కెట్లో చైనా మొబైళ్లు నోకియాని ఎడాపెడా బాదాయి. స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లదే హవా. నోకియా మాత్రమే విండోస్‌ను వాడుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లు 90 కోట్లు, యాపిల్ ఐఫోన్లు 25 కోట్ల పైచిలుకు అమ్ముడవుతున్న ప్రపంచ మార్కెట్లో విండోస్ ఫోన్ల అమ్మకాలు 2-3 కోట్లే. యాప్స్ పరంగా చూస్తే ఆండ్రాయిడ్‌లో 8.5 లక్షల పైచిలుకు, యాపిల్‌లో 9 లక్షల పైచిలుకు ఉండగా... విండోస్‌లో 1,80,000 మాత్రమే ఉన్నాయి. విండోస్ ఫోన్ల అమ్మకాలు తక్కువ కావటంతో ఈ ప్లాట్‌ఫాంపై యాప్స్ తయారీకి డెవలపర్లూ ముందుకు రావట్లేదు. అందుకనే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సర్వీసులు అన్నీ ఒకచోట అందించేందుకు మోటరోలాను కొన్న గూగుల్ బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా నడిచింది. అయితే శాంసంగ్, హెచ్‌టీసీ లాంటి ఇతర హ్యాండ్‌సెట్ తయారీ సంస్థలు కొన్ని మోడళ్లను విండోస్ ప్లాట్‌ఫాంపై తయారు చేస్తున్నాయి. నోకియాతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం వల్ల అవి పునరాలోచనలో పడే ప్రమాదమూ ఉంది.

- సాక్షి బిజినెస్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement