విద్యార్థుల కోసం ఆఫీస్ 365 యూనివర్సిటీ
ఇంటర్నెట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం 'ఆఫీస్ 365 యూనివర్సిటీ'ని విడుదల చేసింది. ఇందులో మొత్తం ఆఫీస్ అప్లికేషన్లుంటాయి. వీటిని రెండు పీసీలు లేదా మ్యాక్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో ఆఫీస్ ఆన్ డిమాండ్, 20 జీబీ ప్రీమియం స్కైడ్రైవ్ స్టోరేజి కూడా ఉంటాయి. నాలుగేళ్ల పాటు వ్యాలిడిటీలో ఉండే ఈ ప్యాకేజి ధర 4,199 మాత్రమే. దేశంలోని విశ్వవిద్యాలయాలు, గుర్తింపు ఉన్న కాలేజీలలో చదివేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు ఈ ప్రత్యేక ధర పెట్టడం వల్ల వారు భవిష్యత్తులో అవకాశాలను అందిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం ఆర్ పిచాయ్ తెలిపారు.
దీనివల్ల పని చాలా సులభం అవుతుందని, ఒకేసారి డాక్యుమెంట్లు లేదా నోట్స్ను ఎడిట్ చేసి, షేర్ చేసుకుని, క్లౌడ్లో స్టోరేజి కూడా చేసుకోవచ్చని చెప్పారు. దీన్ని కొనాలంటే విద్యార్థులు ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్లి తమ అర్హతను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం వారు తమ యూనివర్సిటీ వివరాలను పేర్కొని, దాన్ని పరిశీలించుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చని వివరించారు. విద్యార్థులతో పాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో లెక్చరర్లు, అధ్యాపకులు, సిబ్బంది కూడా ఆఫీస్ 365 యూనివర్సిటీని కొనుగోలు చేసుకోవచ్చన్నారు.