గాల్లో ఫైటింగ్.. విమానం ఎమర్జెన్సీ లాండింగ్
బీరూట్ నుంచి లండన్ వెళ్తున్న విమానాన్ని దారిమధ్యలో ఇస్తాంబుల్‌లో అత్యవసరంగా దించేయాల్సి వచ్చింది. భూమికి 30వేల అడుగుల ఎత్తున గాల్లో ఉండగా.. విమానంలో ఇద్దరు ప్రయాణికులు కొట్టుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇద్దరి మధ్య కొట్లాటను ఆపేందుకు కేబిన్ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొట్లాటకు దిగిన పెద్దాయన సిబ్బందిలో ఒకరిని తోసేసి, మరొకరి మీద పిడిగుద్దులు కురిపించారు. దాంతో ప్రయాణికుల్లో ఉన్న ఓ యువకుడు సిబ్బందికి సాయం చేయడానికి ముందుకెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆ పెద్దాయన నెమ్మదించినా, మళ్లీ రెండు నిమిషాలు గడిచాయో లేదో.. స్టివార్డెస్ మీద మండిపడ్డారు. దాంతో అంతకుముందు ఆయనతో గొడవపడ్డ వ్యక్తి మళ్లీ ఆయన మీదకు వెళ్లాడు. సిబ్బంది ఇద్దరినీ వెంటనే విడదీశారు. ఇక ఈ గొడవ సర్దుమణిగే అవకాశం లేదని భావించిన కెప్టెన్.. వెంటనే అనుమతి తీసుకుని, సమీపంలో ఉన్న ఇస్తాంబుల్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అక్కడ విమానం ఆగగానే నలుగురు భద్రతాసిబ్బంది వచ్చి, గొడవపడ్డ పెద్దాయనను లాక్కెళ్లారు.
పెద్దాయన తన భార్యతో పాటు మరో ప్రయాణికుడిపై అరుస్తూ గొడవకు దిగారని విమానంలో ప్రయాణించిన మరోవ్యక్తి చెప్పారు. ఒక ఫ్లైట్ అటెండెంట్ ఆయనను ఆపడానికి ప్రయత్నిస్తే పెద్దాయన బలంగా తోసేశారని, మరో అటెండెంట్ వస్తే ఆమె ముఖం మీద కొట్టారని, ఆ తర్వాత ఓ యువకుడు వచ్చి విడదీశారని తెలిపారు. ఇతర ప్రయాణికులు కూడా ఆయనను ఆపిన తర్వాత పెద్దాయన అందరినీ తినేసేలా చూశాడని, పావుగంట తర్వాత అంతా నెమ్మదించింది అనుకుంటే ఆయన మళ్లీ గొడవ మొదలుపెట్టారని వివరించారు.