జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. 200 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో 72.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రస్తుతం సమాచారం మేరకు రాష్ట్ర జనాభాలో సుమారుగా మూడు కోట్ల మంది పోలింగ్లో పాల్గొన్నట్లు తెలిపారు. కాగా, పోలింగ్ నమోదు ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చన్నారు. సాయంత్రం 5గం.ల వరకూ ఓటర్లు భారీగా రావడంతో ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు.
జైసల్మర్ జిల్లాలో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అవ్వగా, భరత్పూర్ 55 శాతం మాత్రమే నమోదైంది. రాష్ట్ర రాజధాని జైపూర్లో 68శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 199 నియోజక వర్గాలకు చెందిన ఈ ఎన్నికల్లో 2,087 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా చురు నియోజక వర్గానికి జరగాల్సిన పోలింగ్ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్, బీజేపీ లు భారీ ఆశలు పెట్టుకున్నాయి. గెలుపుపై ఇరుపార్టీలు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.