స్కైవేల నిర్మాణాలకు సహకరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్కైవేలకు కంటోన్మెంట్ పరిధిలో భూసేకరణకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అధికారులు బుధవారం పరీకర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన రెండు స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న సుమారు 100 ఎకరాల స్థలం అవసరమని, ఈ భూమి సేకరణకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతంలో భూమి కేటాయిస్తే స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలోని భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరీకర్ చెప్పినట్లు కేటీఆర్ మీడియాతో తెలిపారు.
రెండు స్కైవేల నిర్మాణానికి ప్యారడైజ్ సర్కిల్ నుంచి కొంపల్లి వరకు (ఇందులో 3.8 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది), జూబ్లీ బస్టాప్ నుంచి షామీర్ పేట వరకు (ఇందులో 10 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది) స్కైవేల నిర్మాణాలను తలపెట్టామన్నారు. వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 100 ఎకరాల స్థలం అవసరమవుతుందని చెప్పారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ‘కంటోన్మెంట్‌లో రహదారుల మూసివేతపై కూడా ఈ సందర్భంగా చర్చించాం.
ఇక్కడ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించా లని కోరాం. ఈ మూడు రహదారులకు సంబంధించి భూమి బదలాయింపు కింద ఔటర్ రింగ్ రోడ్డు బయట భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాం. దీనిపై సీఎంతో చర్చించి స్పష్టత ఇస్తామని హామీఇచ్చాం. వారం లోపు ఈ సమస్యను పరిష్కరిస్తాం’ అని కేటీఆర్ అన్నారు. పరీకర్‌ను కలసిన వారిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఏ అండ్ యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, ఆర్‌అండ్‌బీ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తదితరులున్నారు.