‘డబుల్ బెడ్‌రూమ్’లపై పెత్తనం ఎమ్మెల్యేలదే!
- వారి కనుసన్నల్లోనే లబ్ధిదారుల జాబితా
- రెండు పడక గదుల ఇళ్లపై మారిన ప్రభుత్వ వైఖరి
- జిల్లా మంత్రితో కలసి ఎమ్మెల్యేలకు రూపకల్పన బాధ్యతలు.. నేతల ఒత్తిడికి తలొగ్గిన సర్కారు
- అర్హులతోనే జాబితా ఉంటుందంటున్న గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఇక ఎమ్మెల్యేలే చక్రం తిప్పబోతున్నారు. ఏయే గ్రామాల్లో ఇళ్లు కట్టాలో నిర్ణయించేది మొదలు... ఎవరికి కేటాయించాలనే వరకు తేల్చేది కూడా వారే. జిల్లా మంత్రులతో కలసి ఎమ్మెల్యేలే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా గతంలోని ఇళ్ల పథకాల తరహాలోనే ‘డబుల్’ పథకానికి యావత్తూ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కొనసాగనుంది. తొలుత ఎమ్మెల్యేలకు పెత్తనం లేకుండా చేయాలని ప్రభుత్వం భావించినా... తర్వాత నేతల ఒత్తిడికి తలొగ్గింది.
మారిన వైఖరి..: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని నమ్ముతున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు రెండు పడక గదుల ఇళ్ల విషయంలో ఆ పరిస్థితి రావొద్దని భావించారు. అందులో భాగంగానే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను పూర్తిగా కలెక్టర్లకే అప్పగించాలని తొలుత నిర్ణయించారు. ఇళ్లను నిర్మించే గ్రామాల ఎంపిక వరకు మాత్రమే ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని భావించారు. పలు అంతర్గత సమావేశాల్లోనూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కంగు తినాల్సి వచ్చింది. ప్రస్తుతం రెండు పడక గదుల ఇళ్ల పథకంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నందున... ఇలాంటి కీలక పథకంలో తమ భాగస్వామ్యం లేకపోవడం వెలితిగా భావించారు. దానికితోడు తమపై కార్యకర్తల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నందున లబ్ధిదారుల ఎంపికలో తమకూ భాగస్వామ్యం కల్పించాలని వారు సీఎంపై ఒత్తిడి తెచ్చారు. కొందరు మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో మనసు మార్చుకున్న ముఖ్యమంత్రి... ఎమ్మెల్యేలకు పెత్తనం అప్పగించాలని నిర్ణయించారు. ఈమేరకు తుది మార్గదర్శకాల్లో మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది.
లబ్ధిదారుల ఎంపిక ఎలా..?
తొలుత కలెక్టర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసే అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఆ జాబితా ఆధారంగా ఎమ్మెల్యేలు మరో జాబితా సిద్ధం చేస్తారు. అధికారుల కమిటీ గ్రామసభ నిర్వహించి ఎంపిక చేసినవారి అర్హతను నిర్ధారించి ఆమోదిస్తుంది. ఆ మేరకు ఇళ్ల నిర్మాణం చేపడతారు. మొత్తం ఇళ్లలో ఎమ్మెల్యే 50 శాతం, జిల్లా మంత్రి 50 శాతం చొప్పున ఎంపిక చేస్తారు. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలు అందరు కలెక్టర్లకు అందాయి.
అధికారులు రూపొందించే జాబితా, తుదకు గ్రామసభ నిర్వహించి ఆమోదం పొందే జాబితాల రూపకల్పన యావత్తు ఇప్పుడు ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగనుంది. అవకాశం చిక్కితే అస్మదీయులకే ఇళ్లు ఇస్తున్నారంటూ విరుచుకుపడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా ఈ జాబితాలు రూపొందుతాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా, అర్హులతోనే జాబితాలు రూపొందిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.