
రచ్చబండ రసాభాస
‘అనంత’లో చివరి రోజు కార్యక్రమాలు రచ్చరచ్చ
అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే గురునాథరెడ్డి
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ-3 చివరి రోజు కార్యక్రమం రసాభాసగా మారింది. అనంతపురంలోని కేఎస్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను సమస్యలపై ప్రశ్నిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. అదే సమయంలో ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీవో హుసేన్‌సాబ్ ఎమ్మెల్యే నుంచి మైక్ లాక్కున్నారు.
అనంతరం నగర పాలక సంస్థ కమిషనర్ రంగయ్య, ఇతర అధికారులు ఎంపీ వెంట వెళ్లిపోయారు. దీంతో వేదికపై జరగాల్సిన పింఛన్లు, రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకండా అర్ధంతరంగా సభను ముగించి వెళ్లడాన్ని నిరసిస్తూ గురునాథరెడ్డి సప్తగిరి సర్కిల్‌లో రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించారు. పోలీసు అధికారుల సూచన మేరకు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి వెళుతుండగా మార్గమధ్యలో రెండవ పట్టణ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
అలాగే, అమడగూరులో జరిగిన రచ్చబండ వేదికపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో లేకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేత డాక్టర్ హరికృష్ణ నేతృత్వంలో గ్రామస్తులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఒత్తిడికి తలొగ్గిన అధికారులు వేదికపై వైఎస్ ఫొటో పెట్టారు. అయితే, దాన్ని జీర్ణించుకోలేకపోయిన సభాధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధికారులను దుర్భాషలాడుతూ వేదికపై నుంచి కిందకు దిగిపోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన తరువాతే సభ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టుబట్టడంతో ఉరవకొండలో జరిగిన రచ్చబండలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పామిడిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాను సమైక్యవాదులు అడ్డుకున్నారు.