డోక్లామ్: ఆర్మీకి అర్జెంటుగా 20వేల కోట్లు ఇవ్వండి
న్యూఢిల్లీ: ఆర్మీ ఆధునీకరణ, రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం అత్యవసరంగా రూ. 20వేలకోట్లను అదనంగా కేటాయించాలని రక్షణమంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సిక్కిం-భూటాన్, టిబేట్ ట్రైజంక్షన్‌లోని డోక్లామ్ కొండప్రాంతంలో భారత-చైనా సైనికుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ శాఖ నుంచి ఈ ప్రతిపాదన అందడం గమనార్హం.
2017-18 బడ్జెట్‌లో రక్షణశాఖకు అధిక ప్రాధాన్యమిచ్చి.. రూ. 2.74 లక్షల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులకు తోడు అదనంగా రూ. 20వేల కోట్ల అర్జెంటుగా కేటాయించాలంటూ రక్షణశాఖ.. కేంద్ర ఆర్థికశాఖను కోరింది. ఈ మేరకు రక్షణశాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా నేతృత్వంలోని అధికారుల బృందం ఆర్థికశాఖ అధికారులతో భేటీ అయింది. రక్షణశాఖ విన్నపాన్ని సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తామని ఆర్థికశాఖ తెలిపింది. రోజువారీ నిర్వహణ, జీతభత్యాల కోసం బడ్జెట్‌లో రూ. 1,72,774 కోట్లు కేటాయించగా, కొత్త ఆయుధాలు, ఆర్మీ ఆధునీకరణ కోసం రూ. 86,488 కోట్లను కేటాయించింది. అయితే, ఆయుధాల దిగుమతిపై సరికొత్త కస్టమ్స్ సుంకం విధించడంతో రక్షణశాఖ బడ్జెట్‌కు భారీ కన్నం పడింది.