బిహార్ బాహుబలి.. రక్తచరిత్ర
మహ్మద్ షాబుద్దీన్.. బిహార్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేత. భయానకమైన నేరచరిత్ర, విజయవంతమైన రాజకీయ ప్రస్థానం.. ఈ రెండూ కలిపితే షాబుద్దీన్. బిహార్లో ఆయన పేరు వింటే ప్రత్యర్థులు, అధికార యంత్రాగం హడలిపోతారు. రెండు దశాబ్దాల పాటు నేరాలను, రాజకీయాలను సమాంతరంగా నడిపాడు. సొంత బలగాలను ఏర్పాటు చేసుకుని ఓ దశలో సమాంతర ప్రభుత్వాన్ని కూడా నడిపాడు. హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న షాబుద్దీన్ ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. బిహార్లో బాహుబలిగా పిలిచే షాబుద్దీన్.. బాహుబలి సినిమాలో ప్రభాస్ మాదిరి హీరో కాదు.. కరుడుగట్టిన విలన్.
బిహార్లోని శివాన్ జిల్లాలో జన్మించిన షాబుద్దీన్పై 2000వ సంవత్సరం నాటికి 30కి పైగా కేసులు ఉన్నాయి. అక్రమాయుధాలు కలిగిఉండటం, బాంబు పేలుడు, కిడ్నాప్, హత్య కేసులు నమోదయ్యాయి. హుసేన్ గంజ్ పోలీస్ స్టేషన్లో కరుడుగట్టిన నేరగాడిగా అతనిపై కేసు నమోదు చేశారు. ఇంతటి నేరచరిత్ర ఉన్న షాబుద్దీన్ ఉన్నత విద్యావంతుడు కావడం ఆశ్చర్యకరమైన విషయం. పొలిటికల్ సైన్స్లో ఎంఏ, పీహెచ్డీ చేశాడు. అయితే 19 ఏళ్ల వయసు నుంచే నేరాలబాట పట్టాడు. డిగ్రీ చదుకునే రోజుల్లో ఆయనపై తొలి కేసు నమోదైంది.
షాబుద్దీన్ చదువుకుంటూనే క్రిమినల్గా ఎదుగుతూ, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చాడు. 1990లో ఆర్జేడీ యువజన విభాగంలో చేరిన షాబుద్దీన్ అదే ఏడాది ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచాడు. 1995లో మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆ తర్వాత లోక్సభకు పోటీచేసి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు నెగ్గాడు. ఈ రెండు దశాబ్దాల కాలంలో షాబుద్దీన్ నేరాలు, రాజకీయాలను రెండింటినీ కొనసాగించాడు. పోలీసులపై దాడులకు పాల్పడటంతో పాటు ఆయన అనుచరులు దాదాపు 10 మంది పోలీసు అధికారులను చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎదురొచ్చిన ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను కిడ్నాప్ చేయడం, చంపడం వంటి నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. లాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షాబుద్దీన్పై కేసు నమోదు చేసిన శివాన్ జిల్లా ఎస్పీని వెంటనే బదిలీ చేశారు.
జేడీయూ నేత నితీష్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి అయ్యాక షాబుద్దీన్ నేర, రాజకీయ చరిత్రకు అడ్డుకట్టపడింది. షాబుద్దీన్ను అరెస్ట్ చేయించి ఆయనపై కేసుల విచారణకు రెండు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టు ఐదు కేసుల్లో ఆయన్ను దోషిగా ప్రకటించగా, మరో 20 కేసులను ఎదుర్కొంటున్నాడు. జంట హత్యల కేసులో గతేడాది షాబుద్దీన్తో పాటు ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షపడింది. కాగా బిహార్లో రాజకీయ సమీకరణాలు మారడం, నితీష్ ఆర్జేడీ మద్దతు తీసుకోవడం, ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో లాలు చక్రం తిప్పుతుండటం షాబుద్దీన్కు కలసివచ్చే అంశం. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన షాబుద్దీన్ భారీ కాన్వాయ్తో సొంతూరుకు వెళ్లారు. బిహార్లో జంగిల్ రాజ్ మళ్లీ వచ్చిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.