
మార్కెట్‌కు మూడీస్ జోరు
మూడీస్ రేటింగ్ సంస్థ భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో వరుసగా ఐదో ట్రేడింగ్
- ఐదో రోజూ లాభాలే.. నెల గరిష్టానికి సెన్సెక్స్
- 177 పాయింట్ల లాభంతో 28,885కు సెన్సెక్స్
- 64 పాయింట్ల లాభంతో 8,778 పాయింట్లకు నిఫ్టీ
మూడీస్ రేటింగ్ సంస్థ భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లోనూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు లాభపడి 28,885 పాయింట్ల వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 8,778పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ నెల గరిష్ట స్థాయికి చేరింది.చివరిలో కొనుగోళ్లు : భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసముందని, అందుకే రేటింగ్ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి సానుకూలానికి అప్‌గ్రేడ్ చేస్తున్నామని మూడీస్ పేర్కొంది. సావరిన్ రేటింగ్‌ను కూడా త్వరలో అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొంది.
మూడీస్ రేటింగ్ పెంపు ప్రభావంతో స్టాక్ మార్కెట్ సూచీలు పెరిగాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. అయితే పై స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా సూచీలు మరింతగా పెరగలేకపోయాయని వివరించారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. చివరిలో కొనుగోళ్ల జోరు పెరగడంతో సెన్సెక్స్ పెరిగింది. వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 928 పాయింట్లు లాభపడినట్లయింది.
ఫార్మా డౌన్... గ్రేడ్ : బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ సంస్థ పలు ఫార్మా షేర్ల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఆ షేర్లు పతనమయ్యాయి. సన్ ఫార్మా, లుపిన్, సిప్లా, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర ఫార్మా షేర్లు నష్టాలపాలయ్యాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,269 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.21,112 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,37,621 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.194 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.493 కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు.
బ్యాంక్ షేర్లు... రయ్ మున్ముందు మరింతగా పెరుగుతాయ్!
భారత క్రెడిట్ రేటింగ్ అవుట్‌లుక్‌ను మూడీస్ సంస్థ అప్‌గ్రేడ్ చేయడంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. బీఎస్‌ఈ సూచీల్లో బ్యాంక్ సూచీయే అత్యధికంగా లాభపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6 శాతం పెరిగింది. ఇండస్‌ఇండ్‌బ్యాంక్ 4.6 శాతం, కోటక్ బ్యాంక్ 4.1 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.1 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.8 శాతం, యెస్ బ్యాంక్ 2.6 శాతం, ఎస్‌బీఐ 2.5 శాతం, కెనరా బ్యాంక్ 2.4 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 2.4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.6 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.6 శాతం, చొప్పున పెరిగాయి. మూడీస్ రేటింగ్ అవుట్‌లుక్ అప్‌గ్రేడ్ వల్ల విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసం పెరుగుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ చెప్పారు. రానున్న రోజుల్లో బ్యాంక్ షేర్లు మరింతగా పెరుగుతాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు.
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ
డీఐఐ : 09-04 2,167 1,674 493
08-04 1,919 1,537 382
07-04 1,260 1,586 -326
ఎఫ్‌ఐఐ: 09-04 5.589 5,396 194
08-04 4,536 5,016 -479
07-04 3,719 3,575 144
(విలువలు రూ.కోట్లలో)