పాపం మగాళ్లు.. వేధింపులకు బలిపశువులు
ఉద్యోగాలు చేస్తున్న పురుష పుంగవులూ.. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో కార్యాలయాల్లో మగాళ్ల మీద వేధింపులు చాలా ఎక్కువయ్యాయట. క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (క్యూయూటీ), రాయల్ మెల్బోర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్ఎంఐటీ)లకు చెందిన పరిశోధకులు ఈ అంశంపై పరిశోధన చేశారు. గడిచిన ఆరు నెలల్లో వచ్చిన 282 ఫిర్యాదులను వీళ్లు సమీక్షించారు. వీటిలో 78 శాతం వరకు పురుషులు తమ మహిళా సహోద్యోగులను వేధిస్తున్నట్లు ఉన్నాయి. అయితే, మరో 11 శాతం కేసుల్లో మాత్రం పురుషులకు ఇతర పురుషుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని ప్రొఫెసర్ పౌలా మెక్డోనాల్డ్ తెలిపారు. అందిన ఫిర్యాదుల కంటే, వాస్తవంగా అక్కడి పరిస్థితులు మరింత ఘోరంగా ఉంటున్నాయని ఆమె తెలిపారు.
పురుషులపై పురుషుల లైంగిక వేధింపులు బాగా పెరిగాయని, ఈ తరహా ఫిర్యాదులు కూడా ఎక్కువగానే వస్తున్నాయని ఆమె అన్నారు. కార్యాలయాల్లో మేనేజర్లు ఈ తరహా వ్యవహారాలను ఓ కంట కనిపెట్టి ఉంచాలని, మగాళ్లకు కూడా రక్షణ అవసరమేనని ఆమె హెచ్చరించారు. ఆడవాళ్ల మీద ఆడవాళ్లు చేసే లైంగిక వేధింపులు కాస్త తక్కువగానే ఉంటున్నాయని, చాలావరకు ఉన్నతాధికారులైన మహిళలే తమ కింద పనిచేసే మహిళలను వేధిస్తున్నారని పరిశోధనలో తేలింది.