
పార్లమెంట్‌లో గుండెపోటు: ఎంపీ కన్నుమూత
పార్లమెంట్ హాలులో అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరిన సీనియర్ పార్లమెంటేరియన్ ఇ.అహ్మద్(79) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
న్యూఢిల్లీ: అస్వస్థతకుగురై ఆస్పత్రిలో చేరిన సీనియర్ పార్లమెంటేరియన్ ఇ.అహ్మద్(79) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. మళప్పురం(కేరళ) నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆయన.. నిన్న(మంగళవారం) పార్లమెంట్ సెంట్రల్ హాలులో పడిపోయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రివరర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ జాతీయ అధ్యక్షుడైన అహ్మద్.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వంలో విదేశాంగ శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అహ్మద్ మృతిపట్ల ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.