ఫలితాల్లో అదరగొట్టిన ఎంఫసిస్
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ కంపెనీ ఎంఫసిస్కు 2016-17 ఆర్థిక సంవత్సరంలో త్రైమాసిక ఫలితాల బోణి అదిరింది. తొలి త్రైమాసికంలో కన్సాలిడేటడ్ నికర లాభాలు 38శాతం దూసుకెళ్లి, రూ.204.3 కోట్లగా నమోదయ్యాయి. 2016 జూన్ క్వార్టర్ ఫలితాలను కంపెనీ శనివారం ప్రకటించింది. వరుసగా ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ దిగ్గజాలు ఫలితాల్లో నిరాశపరిచినా.. ఎంఫసిస్ మాత్రం లాభాల్లో దూసుకెళ్లింది. నిర్వహణ ఆదాయం యేటికేటికి 1.5 శాతం ఎగబాకి, రూ.1,516.6 కోట్లగా నమోదైనట్టు పేర్కొంది.
తొలి త్రైమాసిక ప్రారంభం బాగుందని.. కొత్త తర సర్వీసులపై కంపెనీ ఎక్కువగా ఫోకస్ చేయడంతో, స్ట్రాంగ్ రిజల్ట్స్ ను నమోదుచేసినట్టు ఎంఫసిస్ సీఈవో గణేష్ అయ్యర్ పేర్కొన్నారు. 2016 ఆర్థిక సంవత్సరం ఎంఫసిస్కు బ్యానర్ ఏడాదని, వృద్ధిని, లాభాలను ఆర్జించడానికి ఈ ఏడాది తాము వ్యూహాత్మక రోడ్ మ్యాప్ను రూపొందించుకున్నామని అయ్యర్ వెల్లడించారు.ఇంటర్నేషనల్ రెవెన్యూ ఏడాదికి ఏడాది 14.7 శాతం పెరిగినట్టు కంపెనీ పేర్కొంది.