ఆయనంటే క్రేజ్
హైదరాబాద్: నొవాటెల్‌లో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను గురువారం ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి ముగ్ధ గాడ్సే ప్రారంభించారు. ఈమెతో ‘సాక్షి’ కాసేపు ముచ్చటించింది. ఆమె మాటల్లోనే..
‘నేను పుట్టింది.. పెరిగింది మహారాష్ట్రలో. స్కూల్‌లో జరిగే ప్రతి పోటీల్లో నేనే విన్నర్. చదువు విషయానికొస్తే డిగ్రీ పూర్తి చేశాను. నిజానికి నేను ఇండస్ట్రీకి రాక ముందు చదువుకునే రోజుల్లో మాది చాలా సాదాసీదా పేద కుటుంబం. ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. పాకెట్ మనీ, కాలేజ్ ఫీజు కోసం పార్ట్ టైంగా వంట నూనె అమ్మి రోజు రూ. 80 సంపాదించేదాన్ని. అప్పట్లో నన్ను చూసిన వాళ్లలో కొంతమంది నన్ను బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనమని సలహా ఇస్తుంటే మొదట్లో నవ్వుకునేదాన్ని. తెలిసిన ఆవిడ సహాయంతో ఆమెతో పాటు జిమ్‌కి వెళ్లటం మొదలు పెట్టాను. అలా అక్కడ నుంచి చిన్న చిన్న బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనటం మొదలు పెట్టా. క్రమంగా పట్టుదల కూడా పెరిగింది. అలా ‘ఫెమీనా మిస్ ఇండియా’ కాంటెస్ట్‌లో ‘మిస్ పెర్ఫెక్ట్’ టైటిల్ గెలుచుకున్నా. అలా అలా మోడలింగ్ చేస్తూ యాడ్స్, సినిమాలు, రియాలిటీ షోలు.. ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నాను. నాలో ఉన్న టాలెంట్‌ని నాకన్నా ముందు నా చుట్టూ ఉన్న ప్రజలే గుర్తించి నన్ను ఈ స్టేజ్‌లో ఉంచారు. నా మొదటి మూవీ ‘ఫ్యాషన్’ అవడం, ఆ సినిమా సక్సెస్‌తో మా జీవితాలు మారిపోయాయి. నాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. హైదరాబాద్ అనగానే వెస్ట్రన్ అమ్మాయిలే ఎక్కువగా ఉంటారని.. నేను కూడా వెస్ట్రన్ వేర్‌లో ఈ ఎక్స్‌పోలో అడుగు పెట్టాను. ఇక్కడి కల్చర్ చూశాక అమ్మాయిలు ట్రెడిషన్‌కి ఎంత వేల్యూ ఇస్తారో తెలిసింది. ఇక కామ్‌గా వెళ్లి ఈ ఎక్స్ పోలోనే ఒక మంచి సంప్రదాయ డ్రెస్ మార్చుకున్నా. ప్రస్తుతం నేను నటించిన బాలీవుడ్ సినిమా ‘క్రేజీ కియా రే’ వచ్చే నెల రిలీజ్ కాబోతుంది. తమిళ్‌లో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఇక టాలీవుడ్ విషయానికొస్తే తెలుగు ప్రజల మనసులో నాకు స్థానం కల్పించుకోవాలని ఎంతో ఆశ. మంచి స్టోరీ, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్ర ఇస్తే కచ్చితంగా తెలుగులో కూడా నటిస్తాను. హీరో ‘నాగ్’ అంటే చాలా క్రేజ్. ఆయనతో కలిసి నటించాలని ఉంది’.