నా కొడుకు వల్లే ప్రధాని పదవి పోయింది!
లక్నో: బహిరంగంగా తన కొడుకు, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ పై విమర్శలు గుప్పించడంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఎప్పుడూ వెనుకాడరు. తాజాగా అఖిలేశ్-తన సోదరుడు శివ్ పాల్ యాదవ్ మధ్య తలెత్తిన అంతర్గత కుటుంబపోరు సమసిపోయిన కాసేపటికే తన తనయుడిపై ములాయం విరుచుకుపడ్డారు.
అఖిలేశ్ ను శివ్ పాల్ తో పోల్చడం సరికాదంటూ తమ్ముడిని వెనుకేసుకొచ్చారు. ఎస్పీ క్షేత్రస్థాయిలో పునాదిని బలోపేతం చేసింది శివ్ పాల్ యాదవేనని పేర్కొన్నారు. పార్టీ రాజకీయ విజయాల కోసం అఖిలేశ్ చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన పలు విషయాలు వెల్లడించారు.
2012 ఎన్నికల అనంతరం అఖిలేశ్ ను సీఎం చేసేందుకు శివ్ పాల్ నిరాకరించారని, 2014 లోక్ సభ ఎన్నికల తర్వాతే ఆయనను సీఎం చేయాలని సూచించారని, కానీ పార్టీ నేతలందరూ అంగీకరించడంతో అఖిలేశ్ ను సీఎం చేసినట్టు వెల్లడించారు. "అఖిలేశ్ ను సీఎం చేసినా ఏం జరిగింది. (లోక్ సభ) ఎన్నికల్లో మేం ఐదు స్థానాలు అది కుటుంబసభ్యులం మాత్రమే గెలిచాం. శివ్ పాల్ మాట విని ఉంటే 30 నుంచి 35 ఎంపీ స్థానాలు గెలిచి ఉండేవాళ్లం' అని పేర్కొన్నారు. అఖిలేశ్ సీఎంను చేయడం వల్ల తన ప్రధాని కల నెరవేరలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన తనయుడు అవ్వడం వల్లే అఖిలేశ్ ముఖ్యమంత్రి అయ్యారని, సొంతంగా ఆయనకు రాజకీయాల్లో ఎలాంటి ఘనతలు లేవని పేర్కొన్నారు.