మోదీ, యోగిల సాయం కోరిన మహిళ
అమ్రోహ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల దృష్టికి తీసుకెళ్లి తనకు సాయం చేయాల్సిందిగా కోరింది. అమ్రోహ జిల్లాకు చెందిన ఈ బాధితురాలు 2014లో ఆరిఫ్ అలీని వివాహం చేసుకుంది. పెళ్లయిన తర్వాత అత్తమామలు, భర్త కట్నం కోసం వేధించేవారని, 2015లో తనను పుట్టింటికి పంపేశారని ఆమె వెల్లడించింది.
తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, ఇటీవల తనకు స్పీడ్ పోస్ట్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడని ఆమె ఆరోపించింది. బాధితురాలు ఈ విషయాన్ని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిల దృష్టికి తీసుకెళ్లి తనకు న్యాయం చేయాలని విన్నవించింది.
ట్రిపుల్ తలాక్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తమకు అన్యాయం జరుగుతోందని కొందరు ముస్లిం మహిళలు పోరాడుతున్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతోందని, దీన్ని రద్దు చేయాల్సిన అవసరముందని ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి అభిప్రాయపడ్డారు.