ఇద్దరు వ్యక్తులకు పెల్లెట్ గాయాలు కావడం తప్ప.. ముజఫర్నగర్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది.
ఇద్దరు వ్యక్తులకు పెల్లెట్ గాయాలు కావడం తప్ప.. ముజఫర్నగర్లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. మతఘర్షణల అనంతరం ఇన్నాళ్లకు అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అక్కడ ఆదివారం పర్యటించనున్నారు. ఫుఘ్నా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేసుకుంటుండగా, వారిపై కాల్పులు జరిగాయి. వారిద్దరికీ పెల్లెట్ గాయాలు అయినట్లు అదనపు డీజీ (శాంతి భద్రతలు) అరుణ్ కుమార్ తెలిపారు.
సంఘటన స్థలం నుంచి కొన్ని కార్ట్రిడ్జిలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలో కొంతమేర ఉద్రిక్తత ఏర్పడింది. మొత్తమ్మీద ఈ ఒక్క సంఘటన తప్ప జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సిఖెరా గ్రామంలో రెచ్చగొట్టే ఎస్ఎంఎస్లు పంపినందుకు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఘర్షణలలో హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో ఖాప్ పంచాయతీ పెద్ద ఒకరి కుమారుడు సహా మరో నలుగురిని బహావ్డీ గ్రామంలో అరెస్టు చేశారు.