![నేను క్షేమంగానే ఉన్నాను: బాల సుబ్రమణ్యం](/styles/webp/s3/article_images/2017/09/2/81378324169_625x300_0.jpg.webp?itok=E72ejbBc)
నేను క్షేమంగానే ఉన్నాను: బాల సుబ్రమణ్యం
జోహెన్నెస్‌బర్గ్: తాను క్షేమంగానే ఉన్నట్టు ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తాను అస్వస్థతకు గురయ్యూనన్న వదంతుల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో శనివారం రాత్రి జరిగిన తొలి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఇఫ్సా) అవార్డుల ప్రదానోత్సవంలో బాలు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా.. 15 భాషల్లో ఒక్కో వాక్యం చొప్పున పాడి విన్పించారు.
అయితే అవార్డు స్వీకరించిన కొద్దిసేపటికే 67 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురైనట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో బాలు ఈ వివరణ ఇచ్చారు. ఇఫ్సా ఈ ఏడాది నుంచి.. ఉభయ దేశాల్లోని ప్రాంతీయ భాషల్లో నిర్మితమైన ఉత్తమ చిత్రాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు అందజేస్తోంది. మన దేశానికి సంబంధించినంత వరకు పలు ఇతర అవార్డులతో పాటు మోహన్ అగాషె (ఉత్తమ నటుడు- అస్తు), వీణ జమ్కార్ (ఉత్తమ నటి-తాపాల్) అవార్డులు గెలుచుకున్నారు.